Thotakura: తోటకూర తినడం ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే, ఇది సూపర్ ఫుడ్ అని ఎందుకంటారంటే…

www.mannamweb.com


Thotakura: పూర్వం తోటకూరను అధికంగా తినేవారు. కానీ ఇప్పుడు తోటకూర పేరు చెబితేనే ఎంతో మంది ముఖం మాడిపోతుంది. ఇక పిల్లలైతే తోటకూరను పూర్తిగా తినడానికే ఇష్టపడరు.

నిజానికి తోటకూర తినకపోతే మనకే నష్టం. ఎన్నో రకాల రోగాలు రాకుండా అడ్డుకోవడంలో ఇది ముందుంటుంది. ఆకుకూరల్లో అతి ముఖ్యమైనవి పాలకూర, తోటకూర. ఈ రెండింటినీ వారానికి రెండు మూడు సార్లయినా కచ్చితంగా తినాలి. ఇలా తినడం వల్ల శరీరానికి పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. తోటకూరను రుచి కోసం కాకుండా ఆరోగ్యం కోసం తినాల్సిన అవసరం. ఐరన్ లోపం ఉన్న వాళ్లు ప్రతిరోజూ తోటకూరను తిన్నా మంచిదే. ఆ లోపం ఎలాంటి సప్లిమెంట్లు వేసుకోకపోయినా తీరిపోతుంది.

తోటకూరలో మనకు అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కెతో పాటూ ముఖ్య పోషకం ఫోలేట్ కూడా ఉంది. ఇవి మన శరీరానికి ఎంతో రక్షణను కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి ఎన్నో వ్యాధులు దాడి చేయకుండా కాపాడతాయి. ముఖ్యంగా కంటి చూపును పెంచడానికి , చర్మ సౌందర్యానికి, జుట్టు ఎదుగుదలకు తోటకూర చాలా అవసరం. వారానికి రెండు మూడు సార్లు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.

క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి తోటకూరకు ఉంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు తోటకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో ఇది ముందుంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి తోటకూర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టిరియా, వైరస్ ల నుంచి కాపాడే శక్తి శరీరానికి వస్తుంది.

తోటకూరలో బీటాకెరాటిన్ ఉంటుంది. ఇది మనకు కంటి చూపుకు అత్యవసరమైనది. బరువు తగ్గాలనుకుంటున్నవారు తోటకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అదనపు కేలరీలు శరీరంలో చేరకుండా ఉంటాయి. తోటకూర తినడం వల్ల శరీరానికి చాలా తక్కువ కేలరీలు అందుతాయి. ఇది బరువును అదుపులో ఉంచుతుంది. తోటకూర తినడం వల్ల ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ సమస్యలు ఏవీ రాకుండా ఉంటాయి. మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావు.

షుగర్ సమస్య ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో తోటకూర ఒకటి. ఈ తోటకూరలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను గట్టిగా మారుస్తుంది. తోటకూరను డయాబెటిస్ ఉన్న వారు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారు కూడా తోటకూరను తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గుండె జబ్బులు ఉన్నవారు తోటకూరను తింటే మంచిది. అలాగే బాలింతలు కూడా తోటకూరను తినడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలు కచ్చితంగా తినాల్సినవి తోటకూర వంటకాలు.