ఈ సెప్టెంబర్ నెలలో సెలవుల పరంపర ప్రారంభం కానుంది. సాధారణ వీకెండ్ సెలవులకు అదనంగా పండుగల వల్ల వరుస సెలవులు రాబోతున్నాయి. సెప్టెంబర్‌లో నాలుగు ఆదివారాలతో పాటు, రెండు శనివారాలు, ఇంకా దసరా పండుగ సెలవులు కలిసి దాదాపు 15 రోజులకు పైగా విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు ఉండనున్నాయి.
వరుసగా మూడు రోజులు సెలవులు:
ఈ వారాంతం నుండి వరుసగా మూడు రోజులు సెలవులు రాబోతున్నాయి. శుక్రవారం, సెప్టెంబర్ 5న ముస్లింల పండుగ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. అలాగే, శనివారం, సెప్టెంబర్ 6న వినాయక నిమజ్జనం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి. ఈ రెండు సెలవులకు సెప్టెంబర్ 7న వచ్చే ఆదివారం కలిసి, మూడు రోజుల సుదీర్ఘ వీకెండ్ లభించింది. ఈ మూడు రోజులు ట్రిప్ ప్లాన్ చేసుకునే వారికి మంచి అవకాశం.
దసరా సెలవులు:
ఈ మూడు రోజుల సెలవులతో పాటు, సెప్టెంబర్ 21 నుండి 30 వరకు బతుకమ్మ, దసరా పండుగలకు కూడా సెలవులు ఉండనున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ అకడమిక్ క్యాలెండర్‌లను విడుదల చేశాయి. సెప్టెంబర్ 21న బతుకమ్మ పండుగతో స్కూళ్లు, కాలేజీలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు మొదలవుతాయి. మొత్తంగా సెప్టెంబర్ నెలలో ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు సెలవుల జాతర అని చెప్పవచ్చు. ఈ సెలవులను సద్వినియోగం చేసుకొని కుటుంబంతో, స్నేహితులతో ఆనందంగా గడపవచ్చు.
































