జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అందమైన జీవితం కోసం కొన్ని త్యాగాలు చేయాలి. కొన్ని సౌకర్యాలను వదులుకోవాలి. చాలా మంది తమ జీవితం తాము అనుకునే విధంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ‘కుందేలుకు మూడే కాళ్లు’ అన్న విధంగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు కొన్ని పనులు పూర్తి చేయడంలో బాధ్యతారాహితంగా ఉంటారు. ఇలాంటి ప్రవర్తన వల్ల వ్యక్తిగతంగానే కాకుండా సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. ఒక కంపెనీల లేదా వ్యవస్థలో పనిచేయాలని అనుకున్నప్పుడు అందుకోసం ఎన్ని కష్టాలు వచ్చినా భరించాలి. కానీ చాలా మంది వీటిని తట్టుకోలేక వెనుకడుగు వేస్తారు. అంతేకాకుండా మరికొందరు ఏదో జాబ్ చేస్తున్నాం లే.. అన్నట్లుగా ఉంటారు. ఇలాంటి ప్రవర్తన ఉన్న వారు జీవితంలో పైకి ఎదగలేరు. అంతేకాకుండా ఇలాంటి వారి ఉద్యోగాలు త్వరగా ఊడే అవకాశం ఉంది. అయితే ఎలాంటి విషయాల్లో పకడ్బందీగా ఉండడం వల్ల ఉద్యోగంలో రాణిస్తారు? జీవితంలో అనకున్నది సాధించాలంటే ముందుగా ఏం చేయాలి?
వెనుకబడి ఉన్నా.. ముందుకు..
కొంత మందికి వ్యాపారం చేయాలని ఆసక్తి ఉంటుంది. మరికొంత మందికి ఉద్యోగం చేయడం ఇష్టం. అయితే ఉద్యోగం చేసేవారి విషయానికొస్తే.. ఒక సంస్థ లేదా కంపెనీ అభివృద్ధి చెందడానికి ఉద్యోగులను నియమించుకుంటుంది. ఏ కంపెనీ అయినా నైపుణ్యం కలిగిన వారు ఉండాలని అనుకుంటుంది. కానీ ప్రతి ఒక్కరూ టాలెంట్ వ్యక్తులు అని చెప్పలేం. కొందరు కాస్త వెనుకబడి ఉంటారు. అయితే వెనుకబడి ఉన్నా.. తెలియని విషయాలు నేర్చుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ చాలా మంది అలా చేయరు. ఈరోజు గడిస్తే చాలు అనుకుంటారు. ఇలా ఉండడం వల్ల కంపెనీ వారిని ఎందుకు భరిస్తుంది? అందువల్ల తోటివారితో పాటు తాము కూడా ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఉండాలి.
అప్డేట్ అవసరం..
కొంత మందికి జాబ్ సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం వారికి ఎలాంటి బాధలు ఉండకపోవచ్చు. కానీ ఎప్పటికీ పరిస్థితి ఒకేలా ఉండదు.కొన్నిసార్లు కంపెనీకి నష్టం రావడం వల్లనో లేదా ఇతర కారణాల వల్ల మూసివేయబడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వేరే జాబ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అయితే ముందుగానే అప్డేట్ అవుతూ ఉండడం బెటర్. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ పనితీరులోనూ మార్పులు వస్తాయి. ఊహించిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే జీవితంలో ఆనందంగా ఉండగులుతారు.
ప్రత్యేకంగా ఉండడం..
ఏ కంపెనీ అయినా బాధ్యతాయుతంగా పనిచేసేవారినే నియమించుకుంటుంది. కానీ కొందరు చాలా వరకు నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలాంటి వారి వల్ల కంపెనీకి ఏమాత్రం లాభం లేకుండా ఉంటుంది. అలాంటప్పుడు అతని స్థానంలో వేరొకరిని నియమించుకోవడానికి కంపెనీ వెనుకాడదు. అలా కాకుండా మిగతా వారికి భిన్నంగా ఉండడం వల్ల వీరి అవసరం కంపెనీకి ఎక్కువగా ఉంటుంది.. అని అనుకునే విధంగా నైపుణ్యం పెంచుకోవాలి. ఇలాంటి నైపుణ్యం ఉంటే వీరిని కంపెనీ అస్సలు వదులుకోదు.