Times Now Survey: మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. తెలంగాణలో 19 స్థానాలకు పోటీ చేసేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ సిద్ధమవుతున్నాయి.
రెండు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ ఉత్సాహంగా ఎన్నికలకు సిద్ధమవుతుండగా, బీఆర్‌ఎస్‌లో నిరాశ కనిపిస్తోంది. అయినా ఓటమిని మర్చిపోయి.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు గులాబీ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లోనూ అధిష్టానానికి నిరసనలు ఎదురవుతున్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఎలా ఉండబోతున్నాయని సర్వే సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ మ్యాట్రిజెస్ ఒపినియన్ పోల్ నిర్వహించింది. ఇందులో బీఆర్‌ఎస్‌కు షాకింగ్ ఫలితాలు తప్పవని తేల్చింది. తెలంగాణలో బీజేపీకన్నా బీఆర్‌ఎస్ బలహీనంగా ఉందని తెలిపింది.
ఒపినియన్ ఫలితాలు ఇలా..
టైమ్స్ నౌ తెలంగాణ ఒపీనియన్ పోల్ 2024 ఫలితాలు ఇలా ఉన్నాయ. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలుస్తుందని అచనా వేసింది. ఇక బీజేపీ 5 స్థానాల్లోల విజయం సాధిస్తుందని, బీఆర్‌ఎస్ ఘోరంగా కేవలం 2 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఎంఐఎం ఒకస్థానంలో గెలుస్తుందని తెలిపింది. 2019లో బీఆర్‌ఎస్ 9 ఎంపీ స్థానాలు గెలిచింది. ఇటీవల పెద్దపల్లి బీఆర్‌ఎస్ ఎంపీ కాంగ్రెస్‌లో చేరాడు. దీంతో దాని బలం 8కి పడిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఈ 8 స్థానాలు నిలిపుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది. కానీ ప్రజల నాడి ఇందుకు భిన్నంగా ఉందని తాజా సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
బీఆర్‌ఎస్‌పై తీరని కసి..
తాజా ఫలితాలు చూస్తుంటే తెలంగాణలో బీఆర్‌ఎస్‌పై ప్రజలకు ఇంక కసి తీరలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించాలని చాలా మంది అనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాల్లో గెలిచింది. దీంతో ఆ పార్టీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు. ఓటమిని అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను మరింత దెబ్బతీయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి కేసీఆర్..
ఇదిలా ఉంటే.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచే లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదలు పెడతారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా సభలు ఉంటాయని గులాబీ భవన్‌లో చర్చ జరుగుతోంది.అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా దాదాపు వందకుపైగా సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అయినా ఫలితాలు రాలేదు. మరి లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్వహించే సభలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.