How to Avoid Children from Mobile in Summer: నేటి పిల్లలంతా స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. కుదిరితే ఫోను లేదంటే టీవీ.. అన్నట్టుగా వాటితోనే గడుపుతున్నారు. బయటికి వెళ్లి ఆడుకోవాలి అనే సంగతే మర్చిపోతున్నారు. అయితే.. ఒక్కరోజు సెలవు దొరికితేనే ఫోన్లో తలకాయ దూర్చే పిల్లలు.. వేసవి సెలవులు వస్తే ఊరుకుంటారా? సెలవులు ఉన్నన్ని రోజులు ఫోన్లు, టీవీలతోనే కాలక్షేపం చేస్తారు. ఇది చూసిన పెద్దలు ఆందోళన చెందుతుంటారు. ఈ లిస్టులో మీ పిల్లలు కూడా ఉంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. ఈ సమ్మర్లో పిల్లలు ఫోన్లకు దూరంగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి.
రిలేటివ్స్ ఇంటికి పంపించడం: ఒకప్పుడు పిల్లలకు వేసవి సెలవులు మాత్రమే కాదు పండగ సెలవులు వచ్చినా.. అమ్మమ్మ, నానమ్మ, అత్త, పిన్ని.. అంటూ బంధువుల ఇళ్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ సెలవులు వచ్చినా ఇంట్లోనే ఉంటున్నారు. ఫోన్లకు అంకితమైపోతున్నారు. అలా కాకుండా ఉండాలంటే పిల్లలను చుట్టాలింటికి పంపించాలని అంటున్నారు. కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? మనుషులు ఎలా ఉంటారు? అనే విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా అక్కడ చిన్నపిల్లలతో ఫ్రెండ్షిప్ చేస్తే కొత్త కొత్త ఆటలు నేర్చుకుంటారు. దీనివల్ల ఫోన్ ఉపయోగించడం క్రమంగా తగ్గిస్తారని చెబుతున్నారు.
గేమ్స్ ఆడించడం: ఈరోజుల్లో గేమ్స్ అంటే.. వీడియో గేమ్స్, పబ్జీ, ఇంకా ఆన్లైన్ గేమ్స్ మాత్రమే అని పిల్లలు అనుకునేలా తయారైంది పరిస్థితి. ఇవి మానసికంగా ఒత్తిడి కలిగించేవే తప్పించి ఆరోగ్యాన్ని పెంచేవి కావు. అసలు ఆటలంటే మైదానాల్లో ఆడేవేనని అంటున్నారు నిపుణులు. వీటితోపాటు చిన్న పిల్లలు సరదాగా ఆడుకునే పులి-మేక, గోలీలు, ఏడుపెంకులాట, నాలుగు స్తంభాలు, వీరి వీరి గుమ్మడిపండు, లండన్ లండన్ స్టాప్, కళ్లకు గంతలు ఆటలన్నీ భలే సరదగా ఉంటాయి. ఈ ఆటలు ఆడితే అటు మానసికంగా, ఇటు శారీరకంగా ప్రయోజనాలు అందిస్తాయి. ఈ ఆటల్లోని సరదా తెలిస్తే ఫోన్ తీసుకోమన్నా కూడా పిల్లలు తీసుకోరని చెబుతున్నారు.
కథలు చెప్పడం: చిన్నపిల్లలు కథలను ఎంతగానో ఇష్టపడతారు. అయితే ప్రస్తుత రోజుల్లో కథలు చెప్పేంత తీరిక పెద్దవాళ్లకు లేకపోవడంతో ఫోన్లోనే పిల్లలకు కావాల్సిన కథలు పెట్టుకుని వింటున్నారు. అయితే ఇలా వినడం కన్నా.. పెద్దల ద్వారా వింటే ఆ ఊహాలోకంలోకి వెళ్లొచ్చంటున్నారు నిపుణులు. కథలే కాకుండా ఇతిహాసాలు కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచి చెబితే వాటి మీద ఇంట్రస్ట్ కలిగి ఫోన్ జోలికి పోరంటున్నారు నిపుణులు.