Tirumala: లడ్డూ తయారీలో కల్తీనెయ్యి కేసులో నలుగురి అరెస్ట్

తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి కేసులో నలుగురు కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్టు చేసింది.


సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌..

ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ డైరెక్టర్లు విపిన్‌ జైన్‌(45), పోమిల్‌ జైన్‌(47).. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనుమాకలోని వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ లిమిటెడ్‌ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్‌ చావ్దా (47), తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఏఆర్‌ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజు రాజశేఖరన్‌(69)ను అరెస్టు చేసింది.

కల్తీ జరిగిన కాలంలో విపిన్‌ జైన్‌, పోమిల్‌ జైన్‌ వైష్ణవి డెయిరీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

నలుగురినీ ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సులో వున్న సిట్‌ కార్యాలయానికి తరలించారు.

రాత్రి 8.20 గంటల సమయంలో రిమాండ్‌ రిపోర్టు సిద్ధం చేసి వైద్య పరీక్షల నిమిత్తం నలుగురినీ భారీ భద్రత నడుమ రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైద్య పరీక్షల అనంతరం రాత్రి 9.10 గం.లకు 2వ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ప్రవీణ్‌కుమార్‌ నివాసానికి తీసుకెళ్లారు.

కేసు విచారణాధికారిగా ఉన్న జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు, ఏపీపీలు వారిని ఆయన ఎదుట ప్రవేశపెట్టారు.

రిమాండ్‌ రిపోర్టును పరిశీలించిన న్యాయాధికారి, నలుగురికీ జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. అనంతరం వారిని తిరుపతి సబ్‌ జైలుకు తరలించారు.

వివాదం ఏంటి?

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు ‘యానిమల్ ఫ్యాట్’ కలిసిన నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో వివాదం మొదలైంది.

2024 జూన్ 16న తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సిబ్బంది నుంచి సమాచారం సేకరించగా… నెయ్యి నాణ్యత బాగాలేదని వాళ్లు చెప్పారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

మరోవైపు, జూన్, జులైలో టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని, ఆ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెన్నైకి చెందిన ఏఆర్ డెయిరీ తెలిపింది.

తిరుమలలో ప్రసాదాల కోసం పెద్ద ఎత్తున నెయ్యి వాడతారు. అయితే గతంలో వనస్పతి మాత్రమే కలిసి కల్తీ అయిందని చెప్పిన ఈవో శ్యామల రావు, నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలిసిందని ప్రకటించారు.

చంద్రబాబు ఏమన్నారు?

2024 సెప్టెంబర్ 18న ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఆ క్రమంలో ఆయన తిరుమల లడ్డూ తయారీలోనూ గత ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలు పాటించలేదని తీవ్ర ఆరోపణలు చేశారు.

‘తిరుమల లడ్డూను కూడా నాసిరకంగా తయారు చేస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పాం. కానీ, అక్కడ దుర్మార్గమైన ప్రయత్నాలు చేశారు. అన్నదానంలో కూడా క్వాలిటీ లేకుండా చేశారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా వ్యవహరించారు. ఒక్కోసారి చాలా బాధేస్తోంది. నాసిరకమైన ఇన్‌గ్రీడియెంట్సే కాకుండా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్‌ను వాడారు. మేం నాణ్యత పెంచుతాం. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే బాధ్యత మనందరిపైనా ఉంది’ అన్నారు.

నెయ్యి నాణ్యతపై అప్పట్లో టీటీడీ ఈవో ఏమన్నారంటే…

తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి నాణ్యతపై జరుగుతున్న వివాదంపై టీటీడీ ఈవో శ్యామలరావు గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నెయ్యి నాణ్యతపై సమాచారం సేకరించామని అన్నారు.

”లడ్డూ నాణ్యత పడిపోయిందని, లడ్డూలో వాడిన నెయ్యి నాణత్యపై ఫిర్యాదులు వస్తున్నాయని, జంతువుల కొవ్వు వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై దృష్టిపెట్టాలని చంద్రబాబు ఆదేశించారు.” అని ఈవో చెప్పారు.

2024 జూన్ 16న టీటీడీ ఈవోగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సిబ్బంది నుంచి సమాచారం సేకరించగా… నెయ్యి నాణ్యత బాగాలేదని వాళ్లు చెప్పారని ఈవో తెలిపారు.

లడ్డూ నాణ్యత బాగుండాలంటే నెయ్యి నాణ్యత బాగుండాలని, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడితేనే లడ్డూ నాణ్యత బాగుంటుందని, లేకపోతే తిరుమల పవిత్రత దెబ్బతింటుందని నిపుణులు అన్నారని ఈవో చెప్పారు.

”అడల్ట్రేషన్ ల్యాబ్ ఏర్పాటుకు రూ.75 లక్షలు మాత్రమే ఖర్చుఅవుతుంది. కానీ ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేయలేదో తెలియదు. సొంత ల్యాబ్ లేకపోవడం, బయట కూడా నాణ్యతా పరీక్షలు నిర్వహించకపోవడంతో ఈ విషయాలను అలుసుగా తీసుకుని సరఫరాదారులు నాణ్యత లేని నెయ్యి సరఫరా చేశారు” అని ఈవో ఆరోపించారు.

”కేజీ నెయ్యి రూ.320 నుంచి రూ.411లకు సరఫరా చేశారు. ఇంత తక్కువ రేటులో నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. నెయ్యిని తక్కువ రేటుకు కొనడం వల్ల నాణ్యత పడిపోయింది. నేను ఈవో అయిన తర్వాత నెయ్యి నాణ్యతపై ప్రశ్నించి, సరఫరాదారులను బ్లాక్ లిస్ట్ చేస్తామని హెచ్చరించడంతో ఆ కంపెనీలు నాణ్యమైన నెయ్యి సరఫరా చేయడం మొదలుపెట్టాయి” అని ఈవో చెప్పారు.

లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యత పరీక్షించేందుకు కావాల్సిన ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ఎన్‌డీడీబీ ముందుకొచ్చిందన్నారు. రూ.75 లక్షల విలువైన సామాగ్రిని ఉచితంగా అందిస్తోందని తెలిపారు.

ఏఆర్ డెయిరీ స్పందన..

2024 జూన్, జులైలో టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని, ఆ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెన్నైకి చెందిన ఏఆర్ డెయిరీ అప్పట్లో తెలిపింది. ఫుడ్ సేఫ్టీ విభాగం, అగ్‌మార్క్ అధికారులు శాంపిళ్లు సేకరించి, ఎలాంటి సమస్య లేదని తేల్చారని ఏఆర్ డెయిరీ ఫుడ్ క్వాలిటీ చెకింగ్ డిపార్ట్‌మెంట్ ఇన్‌చార్జ్ లెని చెప్పారు.