తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాలు నేడు కూడా కొనసాగుతున్నాయి. అయితే రేపటితో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి.


గత నెల 30వ తేదీన ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెల 8వ తేదీ వరకూ జరుగుతాయని ముందుగానే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపటితో పది రోజుల పాటు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాలను నిర్వహించినట్లయింది. ఎల్లుండి నుంచి ప్రత్యేక దర్శనాలను అనుమతించనున్నారు. నేడు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.48 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.

లక్షల సంఖ్యలో భక్తులు…

ఇప్పటి వరకూ లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. రోజుకు ఎనభై వేలకు మందికిపైగానే స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా స్వామి వారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగిందని అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామని, వారికి అవసరమైన అన్న ప్రసాదాలను, వసతిని కల్పించామని అధికారులు తెలిపారు.

ఎల్లుండి నుంచి ఆన్ లైన్ లో…

ఇక జనవరి 9వ తేది నుండి ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయనుంది. నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని తిరుమల తిరుపతిదేవస్థానం నిర్ణయించింది. తిరుమలలో ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ నిలిపివేసింది. యథావిధిగా ఇప్పటికే అమలులో ఉన్న శ్రీవాణి దర్శన టికెట్ల అడ్వాన్స్ బుకింగ్, తిరుపతి విమానాశ్రయంలోని ఆఫ్ లైన్ కరెంట్ బుకింగ్ విధానం అమలవుతుంది. భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి రోజువారి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.