తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై సామాన్య భక్తులకు అదిరిపోయే శుభవార్త

www.mannamweb.com


తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి మాసంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. కలియుగ వైకుంఠ దైవం ఏడుకొండల పైన కొలువైన తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజులపాటు సాగిన వైకుంఠ ద్వార దర్శనాలకు టిటిడి విస్తృతమైన ఏర్పాట్లను చేస్తుంది.

పది రోజులపాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలలో ప్రతిరోజూ దాదాపు 70 వేల వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టిటిడి అన్ని చర్యలను చేపట్టింది.

తిరుపతిలోనూ, తిరుమలలోనూ 9 కేంద్రాలలో 91 కౌంటర్లు

ఈ మేరకు జనవరి 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తామని తిరుపతిలోనూ, తిరుమలలోనూ 9 కేంద్రాలలో 91కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని టిటిడి ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఇప్పటికే 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేసి రోజుకు 40వేలు చొప్పున టోకెన్లు ఇవ్వనున్నారు.

నాలుగు లక్షల సర్వదర్శన టోకెన్లు ఇవ్వనున్న టీటీడీ

10 రోజులకు నాలుగు లక్షల సర్వదర్శన టోకెన్లను తిరుపతిలో 8కేంద్రాలలోనూ, తిరుమలలో ఒక కేంద్రం ద్వారా జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి పది రోజుల శ్రీవాణి టికెట్లను ఆన్లైన్లో విడుదల చేశారు. అంతేకాదు వైకుంఠ ద్వార దర్శనాలకు పది రోజుల ఎస్ఈడీ టోకెన్లను కూడా ఆన్లైన్లో విడుదల చేశారు.

తిరుపతి, తిరుమలలో టోకెన్ జారీ కేంద్రాలు ఇవే

తిరుపతిలోని ఎంఆర్ పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, ఇందిరా స్టేడియం, రామచంద్ర పుష్కరిణి ,విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లతోపాటు, తిరుమల లోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో కూడా టోకెన్లను జారీ చేయనున్నారు. ఇక టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లను చేయనున్నారు. వైకుంఠ ద్వార దర్శనం రోజులలో టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతినిస్తారు.

వైకుంఠ ఏకాదశి నాడు ప్రోటోకాల్ దర్శనాల సమయం ఇదే

ఇక వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45నిమిషాలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని ఆరోజు అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేద ఆశీర్వచనం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని, భక్తులకు కాఫీ, పాలు, టీ, ఉప్మా, చక్ర పొంగలి, పొంగలి వంటి వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించారు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు స్వర్ణ రథం, చక్ర స్నానం

ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు మూడున్నర లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచనున్నారు. ఇక ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలరావు పోలీసులకు సూచించారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం ఉంటుందని, వైకుంఠ ద్వాదశి రోజు ఉదయం 5:30 నుంచి 6:30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం ఉంటుందని పేర్కొన్నారు.

వీరిని దర్శనానికి అనుమతించం

తిరుమలకు వచ్చే గోవింద మాల భక్తులకు ఎటువంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదని, టికెట్లు లేని భక్తులను క్యూలైన్లలోకి అనుమతించేది లేదని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. భక్తులు ఈ విషయాలను తెలుసుకుని తదనుగుణంగా తిరుమలకు రావాలని సూచించారు.