తిరుపతి- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్: కొత్త పాంబన్ బ్రిడ్జి మీదుగా

తమిళనాడులోని రామేశ్వరం వద్ద కొత్తగా నిర్మించిన పాంబన్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తరువాత పలు రైలు సర్వీసులు పునరుద్ధరణకు నోచుకున్నాయి.


దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి రామేశ్వరానికి రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

నిన్నటి వరకు ఈ సౌకర్యం ఉండేది కాదు. పాత పాంబన్ బ్రిడ్జిని మూసివేయడంతో రామేశ్వరం వరకు రాకపోకలు సాగించిన రైళ్లన్నీ కూడా మండపం వద్దే ఆగిపోయేవి. ఇప్పుడు కొత్త వంతెన అందుబాటులోకి రావడం వల్ల రైలు సర్వీసులను రామేశ్వరం వరకు పొడిగించారు. గతంలో ఉన్న వాటిని యధాతథంగా పునరుద్ధరించారు.

శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాంబన్ బ్రిడ్జిని జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. దీనితో పాటు తాంబరం- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌కూ ఆయన జెండా ఊపారు. కొత్త వంతెనపై మొట్టమొదటి సారిగా ఈ రైలు రాకపోకలు సాగించిన విషయం తెలిసిందే. ఫలితంగా- వివిధ నగరాలు, ప్రధాన పట్టణాల నుంచి రామేశ్వరానికి రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్టయింది.

ఈ జాబితాలో తిరుపతి సైతం ఉంది. గతంలో తిరుపతి నుంచి రామేశ్వరానికి ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ నడిచేది. పాత పాంబన్ వంతెనను మూసివేయడం వల్ల ఈ రైలు మండపం వరకే రాకపోకలు సాగించేది. ఇప్పుడు పునరుద్ధరించిన ఎక్స్‌ప్రెస్‌ జాబితాలో దీన్ని కూడా చేర్చారు దక్షిణ రైల్వే అధికారులు. తిరుపతి నుంచి మండపం వరకు వెళ్లే నంబర్ 16779 ఎక్స్‌ప్రెస్ కొత్త పాంబన్ బ్రిడ్జి మీదుగా రామేశ్వరం వరకూ వెళ్తుంది.

తిరుపతి నుంచి బయలుదేరి వెళ్లే ఈ రైలు పాకాల జంక్షన్, కాట్పాడి జంక్షన్, వేలూరు కంటోన్మెంట్, తిరువణ్ణామలై, విల్లుపురం జంక్షన్, తిరుపాద్రిపులియూర్, కడలూర్ పోర్ట్, చిదంబరం, సర్కాజి, మైలాడుథురూ జంక్షన్, కుంభకోణం, పాపనాశం, తంజావూరు, తిరుచిరాపల్లి, దిండిగల్ జంక్షన్, కొడైకెనాల్ రోడ్, మధురై జంక్షన్, మనమధురై జంక్షన్, పరమకుడి, రామనాథపురం, మండపం మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

అలాగే.. నంబర్ 22613 అయోధ్య కంటోన్మెంట్- రామేశ్వరం, 22535 బనారస్- రామేశ్వరం, 20849 భువనేశ్వర్- రామేశ్వరం, 20498 ఫిరోజ్‌పూర్- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌లు పునరుద్ధరించిన రైళ్ల జాబితాలో ఉన్నాయి.

వీటితో పాటు 16849 తిరుచిరాపల్లి జంక్షన్- రామేశ్వరం, 16751 చెన్నై ఎగ్మోర్- రామేశ్వరం 16618 కోయంబత్తూర్- రామేశ్వరం, 22661 చెన్నై ఎగ్మోర్- రామేశ్వరం, 22622 కన్యాకుమారి- రామేశ్వరం, 16734 ఓఖా- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ రైళ్లు మండపంలో హాల్ట్ అయ్యే టైమింగ్స్‌ను సవరించారు.