కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి

రోజూ వంటకాల్లో తప్పనిసరిగా అందరూ ఉపయోగించే వాటిలో కొత్తిమీర ఒకటి. ఇది వేయకపోతే అనుకున్నంత రుచి రాదు. పప్పు, కర్రీస్, రైతా లేదా సలాడ్ ఇలా ఏదయినా సరే చివరగా కాసిన్ని కొత్తిమీర ఆకులను వేస్తే ఆ టేస్టే వేరు. ఆహారపదార్థాలకు సాటిలేని రుచి, సువాసన, అందం తెచ్చేది కొత్తిమీరే అన్న ఆశ్చర్యం లేదు. అందుకే దాదాపు ప్రతి ఒక్కరూ వంటగదిలో కొత్తిమీరను ఎక్కువగా నిల్వ చేసుకోవడానికి ఇదే కారణం. అయితే, కొత్తిమీరతో వచ్చిన అతిపెద్ద సమస్య నిల్వ చేయడం. ఎందుకంటే ఇది చాలా త్వరగా వాడిపోతుంది. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసినా రెండు మూడు రోజుల్లోనే తాజాదనం, రంగు కోల్పోయి ఎండిపోవడం లేదా కుళ్లిపోవడం జరుగుతుంది. అందుకే ఎక్కువ మొత్తంలో కొత్తిమీర కొనేందుకు చాలామంది ఇష్టపడరు. ఇక నుంచి మీరు కొత్తిమీర నిల్వను పెద్ద సమస్యగా భావించకండి. ఈ సమస్యను పరిష్కారించేందుకు కొన్ని అద్భుతమైన చిట్కాలు ఇక్కడున్నాయి.


కొత్తిమీర తాజాగా ఉండేందుకు టిప్స్:

కొత్తిమీర ఆకులు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఆకులను బాగా కడిగి ఆరనివ్వండి. ఇప్పుడు కొత్తిమీర ఆకులను టిష్యూ పేపర్‌లో చుట్టి గాలి చొరబడని కంటైనర్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచండి. దీని వల్ల కొత్తిమీర ఎక్కువ కాలం చెడిపోదు. అలాగే ఎండిపోదు.

జిప్ లాక్ ప్లాస్టిక్ సంచుల సహాయంతో కూడా మీరు కొత్తిమీరను చాలా రోజులు నిల్వ చేయవచ్చు. ముందుగా కొత్తిమీర ఆకులను కడిగి నీరు పోయేవరకూ ఆరబెట్టండి. ఇప్పుడు కొత్తిమీర ఆకులను టిష్యూ పేపర్‌లో చుట్టి ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేయండి. తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్‌ జిప్ లాక్ చేసి ఫ్రిజ్‌లో ఉంచండి.

కొత్తిమీర ఆకులను నిల్వ చేయడానికి కూడా నీటిని ఉపయోగించవచ్చు. నీటితో నింపిన గ్లాసులో కొత్తిమీర ఆకులను వాటి వేర్లతో సహా వేయండి. వేర్లు నీటిలోనే ఉంటే ఆకులు చెడిపోకుండా తాజాగా ఉంటాయి.

కొత్తిమీర ఆకులను ఫ్రీజర్‌లో నిల్వ చేయడం ద్వారా కూడా మీరు వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచవచ్చు. ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కోయాలి. ఇప్పుడు తరిగిన కొత్తిమీరను ఒక ప్లాస్టిక్ పెట్టెలో నింపి ఫ్రీజర్‌లో ఉంచండి. ఇలాచేస్తే కొత్తిమీర ఆకులు చాలా రోజులు తాజాగా, ఆకుపచ్చగా ఉంటాయి.

కొత్తిమీర పొడి తయారీ :

కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాక వాటిని చిన్న ముక్కలుగా కట్ చేయండి. వీటిని ఒక ప్లేట్ పై వేసి రెండు రోజులు నీడలో ఆరబెట్టండి. ఎండిన తర్వాత కొత్తిమీర ఆకుల పొడిని సిద్ధం చేసుకోండి. గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసి వాడండి.