ఆఫీసుకు ఇంటికి కాస్త దూరం పెరిగితే.. ఉండేది అద్దె ఇళ్లు అయితే వెంటనే మారిపోవడం చేస్తుంటారు చాలా మంది. ప్రతీ రోజు 30 నుంచి 40 కి.మీ. జర్నీ చేయలేకపోతున్నాన్ బ్రో అని చెబుతుంటారు.
కారణం.. ట్రాఫిక్ అని ఒకరంటే.. టైడ్ నెస్ అని మరొకరు అంటారు. ఏది ఏమైనా.. నివాసానికి ఆఫీసుకు దూరం వీలైనంత దగ్గరగా ఉండాడాన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు.
ఒక అరగంట అటు ఇటుగా లేచినా, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా, వర్షం వచ్చినా.. పెద్దగా టెన్షన్ పడకుండా సమయానికి ఆఫీసుకు చేరిపోవచ్చని భావిస్తుంటారు. అయితే… ఓ మహిళ మాత్రం తన ఇద్దరు పిల్లలనూ ప్రతీ రోజు చూసుకోవడానికి ఉంటుందనే కారణంతో డైలీ 700 కిలోమీటర్లు విమానంలో ప్రయాణం చేసి ఆఫీసుకు వెళ్లి, విధులు నిర్వహించి వస్తున్నారు.
అవును… మీరు చదివింది అక్షరాల నిజం! ఎయిర్ ఏసియాలో ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న రేచల్ కౌర్ అనే మహిళ.. ఇటీవల సీ.ఎన్.ఏ. ఇన్ సైడర్ అనే ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా.. ఇంట్లో పిల్లలతో ఆనందంగా గడపడానికి ఇంతదూరం ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు. అప్పటికి నుంచి ఆమె నెట్టింట వైరల్ గా మారారు!
వాస్తవానికి గతంలో ఆఫీసుకు దగ్గరలోనే రేచల్ అద్దెకుండేవారు. దీంతో.. పిల్లలను చూడటానికి ఆమెకు వారానికి ఒక్కరోజే వీలయ్యేది. ఈ నేపథ్యంలో… తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి మలేసియాలోని పెనాంగ్ లో నివాసం ఉంటున్నారు. దీంతో… ప్రతీ రోజు పెనాంగ్ టు కౌలాలంపూర్ విమాన ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు.
దీనికోసం ఆమె ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తారు.. 5 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు.. 5:55 గంటల ఫ్లైట్ అందుకుంటారు.. 7:45 గంటలకు ఆఫీసుకు చేరుకుంటారు.. సాయంత్రం విధులు ముగించుకుని రిటన్ ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకుంటున్నారు. ఇది వినేవారికి కాస్త నమ్మశక్యంగా లేకపోయినా.. వాస్తవం!
ఈ సందర్భంగా స్పందించిన రేచల్… అప్పట్లో కౌలాలంపూర్ లో ఇల్లు అద్దెకు తీసుకోవడంతోపోలిస్తే.. ఇలా రోజూ ప్రయాణం చేయడం వల్లే తనకు డబ్బులు ఆదా అవుతోందని చెబుతున్నారు. వాస్తవానికి గతంలో ఆఫీసుకు దగ్గర్లో అద్దెకు ఉండేటప్పుడూ నెలకు 474 డాలర్లు (అంటే.. ఇండియన్ కరెన్సీలో రూ.42 వేలు) కాగా… ఇప్పుడు కేవలం 316 డాలర్లు (అంటే.. సుమారు 28 వేల రూపాయలు) మాత్రమే ఖర్చవుతోందని అన్నారు.
పైగా ఇలా ప్రయాణ సమయంలో తనకిష్టమైన సంగీతం వింటూ రావడంతోపాటు.. ఆఫీసుకు వెళ్లే క్రమంలో రోజూ కొంతసేపు నడుస్తానని పేర్కొన్నారు. పైగా.. ఇంతసేపు ప్రయాణం చేసి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలను చూసిన ఆనందంలో అంతా మరిచిపోతున్నట్లు ఆమె తెలిపారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కాగా.. వారి వయసు 11, 12 ఏళ్లు!