నేడు బెంగళూరుకు జగన్.. రెండు వారాల వ్యవధిలో రెండోసారి పయనం
ప్రారంభం కాకుండానే ప్రజాదర్బార్ వాయిదా
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం బెంగళూరు వెళ్లనున్నారు.
ఈ వారం రోజులు ఆయన అక్కడే ఉంటారు. గత నెల 24న బెంగళూరు వెళ్లిన జగన్.. ఈ నెల 1 వరకు అక్కడే ఉండి వచ్చారు. మళ్లీ ఇప్పుడు రెండు వారాల వ్యవధిలోనే మరోసారి అక్కడికి వెళ్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పులివెందుల, బెంగళూరులోనే జగన్ ఎక్కువగా ఉంటున్నారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నాటికి ఆయన తిరిగి వస్తారా.. లేదా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరుపై వైకాపా నుంచి కానీ.. ఆ పార్టీ శాసనసభాపక్షం నుంచి కానీ ఇప్పటికీ స్పష్టత రాలేదు.
సోమవారం నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాదర్బార్’ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు సమాచారం పంపారు. ఇందులో పార్టీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని జగన్ కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రారంభానికి ముందే అది వాయిదా పడింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ప్రజల్ని కలిసేందుకని రూపొందించిన ‘స్పందన’ ప్రారంభం కాకుండా వాయిదాలతోనే ఐదేళ్లు గడిపేశారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ప్రజల్ని కలిసే కార్యక్రమాల్ని వాయిదాలు వేస్తున్నారు.