ఆంధ్రాకు టోల్‌ ఎత్తివేత.. తెలంగాణకు చార్జీల మోత

సొంత రాష్ట్ర ప్రజలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తూ..


కానోళ్లపై ఎక్కడలేని మమకారాన్ని కురిపిస్తున్నారు కాంగ్రెస్‌ పాలకులు. సంక్రాంతికి సొంత ప్రాంతాలకు వెళ్లే ఆంధ్రా ప్రజలకు టోల్‌ చార్జీలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేసిన రాష్ట్ర పాలకులు రాష్ట్ర ప్రజల నుంచి మాత్రం ఆర్టీసీ బస్సులకు 50 శాతం అధిక చార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి పండుగకు ఆంధ్రాకు వెళ్లే వారికి టోల్‌ మినహాయింపు ఇవ్వాలని, ఖర్చు భరిస్తామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి చెప్పి తర్వాత నాలుక కరుచుకున్నారు. మరోవైపు సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్‌లను నడుపుతున్నట్టు ప్రకటించి అధిక చార్జీలు వసూలు చేయనున్నట్టు ముందుగానే ప్రకటించింది.

అదనంగా 50 శాతం వసూళ్లు

సంక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ నడుపనున్న ప్రత్యేక బస్సుల్లో దూరంతో సంబంధం లేకుండా 50 శాతం టికెట్ల ధరలను పెంచారు. ఉదాహరణకు ఉప్పల్‌ నుంచి తొర్రూర్‌కు సూపర్‌ లగ్జరీ టిక్కెట్‌ ధర రూ.300 వరకు ఉండగా.. 50 శాతం అదనపు పెంపుతో అది రూ.430కి పెరగనున్నది. సాధారణ రోజుల్లో టికెట్‌ ధర రూ.100 ఉంటే.. స్పెషల్‌ బస్సుల పేరుతో రూ.150 వరకూ వసూలు చేయనున్నారు. ప్రధానంగా ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎకువగా ఉండే అవకాశం ఉంది.

అన్ని పాయింట్లలో స్పెషల్‌ బస్‌లు..

హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నామని ఉన్నతాధికారులు చెప్పారు. ప్రత్యేక బస్సుల పూర్తి సమాచారం కోసం కాల్‌సెంటర్‌ నం బర్లు 040-69440000, 040-23450033లలో సంప్రదించాలన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.