వినాయక చవితి తర్వాత ఒక రోజు ఇవ్వడంతో విద్యార్థులు ఎగిరి గంతేశారు. మళ్లీ రెండు రోజుల సెలవులు వచ్చాయి. రేపు, ఎల్లుండి కూడా విద్యాలయాలకు సెలవులు ప్రకటిస్తూ అధికారులు ప్రకటన చేశారు.
భారీ వర్షాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో విద్యార్థుల క్షేమం కోసం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గ్రహించాలని అధికారులు సూచించారు. అయితే ఈ సెలవులు తెలంగాణ వ్యాప్తంగా కాదు కేవలం కామారెడ్డి జిల్లాలో మాత్రమే.
కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి కురవడంతో పరిస్థితి భయంకరంగా మారిన విషయం తెలిసిందే. వాగులు, వంకలతోపాటు ప్రాజెక్టులు నిండుకుని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. రెండు రోజు గురువారం కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇంకా వరదలోనే కామారెడ్డి జిల్లా ఉంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి అంటే శుక్ర, శనివారాలు కామారెడ్డి జిల్లాలో అన్ని విద్యాలయాలకు సెలవు ఇస్తూ కలెక్టర్ ప్రకటించారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు ఎవరూ రావొద్దని ప్రజలకు కలెక్టర్ సూచించారు. ఇక నిర్మల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రెడ్ అలర్ట్‌లో నిర్మల్ ఉండడంతో నిర్మల్ జిల్లాలో కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభినవ్ సూచించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోగా.. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బాన్సువాడ-నిజామాబాద్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వకీల్ ఫారం నుంచి మోస్రా వరకు రోడ్డు జలమయమైంది. దీంతో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.




































