Adulterated Ghee: మార్కెట్లోకి టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి, ఈ నకిలీ నెయ్యిని కనిపెట్టడం ఎలా?

Adulterated Ghee: ప్రతి తెలుగింట్లోనూ నెయ్యికి చోటు ఉంటుంది. వేడివేడి అన్నంలో పప్పు. నెయ్యి వేసుకుని తినే వారి సంఖ్య ఎక్కువే. అయితే ఇప్పుడు నకిలీ నెయ్యి మార్కెట్లోకి అధికంగా వస్తోంది.


ఈ కల్తీ నెయ్యిని కొని ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే ఎన్నోసార్లు కల్తీ నెయ్యి అమ్మకాలను అడ్డుకున్నాయి. టన్నులకొద్దీ నకిలీ నెయ్యి ఇంకా మార్కెట్లోకి వస్తూనే ఉంది. అలాంటి నెయ్యిని పిల్లలకు తినిపించడం లేదా పెద్దలు తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలు రావచ్చు.

మనదేశంలో నెయ్యిని లిక్విడ్ గోల్డ్ అని పిలుచుకుంటారు. దాని ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నెయ్యిని మొదటిసారి మన దేశంలోనే తయారు చేశారు. వెన్నను నిల్వచేసి దాన్ని నెయ్యిగా మారుస్తారు. మనదేశం నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆగ్నేయాసియా వంటి ఇతర ప్రాంతాలకు ఈ నెయ్యి వ్యాపించింది.

నెయ్యి సృష్టించింది ఇతడే

హిందూ పురాణాల ప్రకారం చూస్తే నెయ్యిని సృష్టించింది ప్రజాపతి అని చెబుతారు. ప్రజాపతి సంతానాన్ని ఇచ్చే దేవుడు తన చేతులను ఒకదానితో ఒకటి రుద్దడం ద్వారా ఈ నెయ్యిని ఉత్పత్తి చేశాడని, ఆ నెయ్యిని అగ్నికి సమర్పించడం ద్వారా అతనికి సంతానం కలిగిందని కథలు వాడుకలో ఉన్నాయి. నెయ్యితో చేసిన ఏ ఆహారం అయినా చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వాసన తినాలన్న కోరికను మరింతగా పెంచేస్తుంది.

స్వచ్ఛమైన నెయ్యి బంగారాన్ని తలపించేలా ఉంటుంది. నెయ్యి ఉత్పత్తులు మార్కెట్లో కొనేటప్పుడు దాని ప్యాకేజింగ్, ఆ ప్యాకెట్ పై ఉన్న లేబుల్‌ను ప్రత్యేకంగా చదవండి. నెయ్యిని ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసినప్పుడు కాల్చిన వాసన రాకూడదు. అలా కాలిన వాసన వచ్చిందంటే అందులో నీరు లేదా ఇతర పదార్థాలు కలిసాయని అర్థం. అంటే ఆ నెయ్యి కల్తీదని అర్థం.

కల్తీ నెయ్యి ఇలా పరీక్షించండి

నెయ్యి కల్తీతో కాదో తెలుసుకునేందుకు కొన్ని రకాల పరీక్షలు ఉన్నాయి. నెయ్యిని తీసి మీ అరచేతిపై వేసుకున్నప్పుడు అది జారకుండా అక్కడే ఉండి కొన్ని క్షణాలకు కరగడం ప్రారంభిస్తే ఆ నెయ్యి స్వచ్ఛమైనదని అర్థం.

నీటి పరీక్ష

గది ఉష్ణోగ్రత వద్ద ఒక గ్లాసు నీటిని తీసుకొచ్చి పెట్టాలి. అందులో ఒక చుక్క నెయ్యిని వేయాలి. ఆ నెయ్యి తేలితే కల్తీ లేనిదని అర్థం. అలా కాకుండా అది మునిగిపోతే దానిలో ఇతర పదార్థాలు కలిశాయని, నకిలీదని అర్థం.

నెయ్యిని వేడి చేస్తున్నప్పుడు దాని నుంచి బుడగలు, ఆవిరి వంటివి వస్తే అది కల్తీ నెయ్యని అర్థం. నెయ్యిని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టండి. కాసేపటికి డబ్బాలో గాలి బుడగలు ఏర్పడినా, లేదా నూనెల్లాంటివి తేలినా ఆ నెయ్యి కల్తీదని అర్థం చేసుకోవాలి. కల్తీ నెయ్యిని తినక పోవడమే మంచిది. లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.