Tooth Brush: నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే తరచూ వాడే టూత్ బ్రష్ పైనే ఆధారపడి ఉంటుంది. ఒకసారి టూత్ బ్రష్ కొంటే అది అరిగిపోయి, దానికి ఉండే పళ్లు ఉడిపోయినా సరే అలాగే వాడేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల పళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందువల్ల ప్రతీ రోజు రెండు సార్లు బ్రష్ చేయడం ఎంత ఇంపార్టెంటో.. అదే విధంగా వాడుతున్న బ్రష్‌ను ఎన్నిసార్లు మార్చాలో కూడా తెలుసుకోవడం ముఖ్యమే. తరచూ వాడే బ్రష్‌ను మార్చకపోవడం వల్ల దంత సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల టూత్ బ్రష్ ను మార్చడం అనేది చాలా ముఖ్యం. నిర్ణిత సమయంలోనే బ్రష్‌ను మార్చడం వల్ల నోటి దుర్వాసన, బ్యాక్టీరియా వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు బ్రష్ తో పాటు పేస్ట్ ను కూడా మార్చడం మంచిది.
ముఖ్యంగా ఆ సమయంలో..
ముఖ్యంగా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ వంటి సమస్యల నుంచి కోలుకున్న తర్వాత టూత్ బ్రష్‌ను మార్చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ టూత్ బ్రష్ వాడుతాం కాబట్టి.. వాటిపై బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి. అందువల్ల అనారోగ్యం తరువాత టూత్ బ్రష్‌ను మార్చడం వల్ల పళ్ల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.
సాధారణ బ్రష్..
సాధారణ బ్రష్‌లు వాడే వారు అయితే మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి బ్రష్‌లను మారుస్తూ ఉండాలి. ఈ మేరకు సీడీసీ(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తెలిపింది. నాలుగు నెలలకంటే ఎక్కువ రోజులు బ్రష్ ను ఉపయోగిస్తే అరిగిపోతుంది. అరిగిపోయిన బ్రష్ ను వాడడం వల్ల దంత సమస్యలు తలెత్తుతాయి. చిగుళ్లు దెబ్బతినడం, సరిగ్గా క్లీన్ కాకపోవడం వంటి సమస్యల బారిన పడే ఛాన్స్ ఉంటుంది.
ఎలక్ట్రానిక్ బ్రష్‌లు..
సాధారణ బ్రష్‌ల కంటే ఎలక్ట్రానిక్ బ్రష్ లను 12 వారాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఎలక్ట్రానిక్ బ్రష్‌లకు ఉండే హెడ్ వద్ద చిన్న ముళ్లు ఉంటుంది. అది త్వరగా అరిగిపోతుంది. అందువల్ల 12 వారాలు అంటే 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి.
పిల్లల బ్రష్..
పిల్లల బ్రష్ లను అయితే కనీసం 3 లేదా 4 వారాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఎందుకంటే పిల్లల బ్రష్ లు చాలా చిన్నగా ఉంటాయి. అందువల్ల బ్రష్ లు త్వరగా అరిగిపోతాయి. చిన్న వయస్సులోనే వారికి దంతసమస్యలు ఏర్పడితే ఇక భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల పిల్లల బ్రష్ లలో జాగ్రత్త తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.