శతాబ్దాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్నో మతాలు, కులాలు ఆవిర్భవించాయి. వాటి సంఖ్య, వాటిని అనుసరించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. అన్ని మతాలూ బోధించేది మంచే అయినా వాటిని అన్వయించుకునే వారిని బట్టి అవి వివిధ దేశాల్లో కొన్ని వేగంగానూ, మరికొన్ని ఆలస్యంగానూ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక ప్రజలు అనుసరించే టాప్ 10 మతాల్ని ఓసారి చూద్దాం..
ప్రపంచంలో అత్యధికంగా అనుసరిస్తున్న మతం క్రైస్తవం. దీనికి 200 కోట్ల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. అమెరికా, బ్రెజిల్, రష్యా, మెక్సికోతో పాటు పలు యూరప్ దేశాల్లోనూ క్రైస్తవం విపరీతంగా ప్రచారంలో ఉంది. క్రైస్తవం అనుసరించే వారు జీసస్ ను ఆరాధిస్తారు. వీరి పవిత్ర గ్రంధం బైబిల్. క్రైస్తవం తర్వాత ప్రపంచంలో అత్యధిక ఫాలోయర్లు కలిగిన మతం ఇస్లాం. దీనిని 180 కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. వీరిలో అత్యధికులు ఇండోనేషియా, పాకిస్తాన్, భారత్, మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికాలోనూ ఉన్నారు. వీరు అల్లాను ఆరాధిస్తారు. వీరి పవిత్ర గ్రంథం ఖురాన్.
క్రైస్తవం, ఇస్లాం తర్వాత ప్రపంచంలో అత్యధికులు అనుసరించే మతం హిందూ మతమే. దీనికి 110 కోట్ల మంది అనుసరించే వారు ఉన్నారు. వీరిలో అత్యధికులు భారత్ లోనే ఉండగా.. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి ఇతర దేశాల్లోనూ వీరి ఉనికి ఉంది. హిందూ మతం తర్వాత 50 కోట్ల మంది ఫాలోయర్లతో బౌద్ధమతం నాలుగో స్ధానంలో ఉంది. చైనా, జపాన్, థాయిలాండ్, శ్రీలంక, మయన్మార్ లో బౌద్ధమతాన్ని అనుసరించే వారు ఎక్కువగా ఉన్నారు.
ఆ తర్వాత ఐదో స్ధానంలో షింటోయిజం ఉంది. ఈ మతాన్ని 104 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇది జపాన్ ప్రజలు అనుసరించే మతం. ఆ తర్వాత ఆరో స్ధానంలో 25 కోట్ల మంది అనుచరులతో సిక్కు మతం ఉంది. భారత్, కెనడా, యూఎస్, యూకే వంటి దేశాల్లో సిక్కులు ఎక్కువ మంది ఉన్నారు. ఏడో స్ధానంలో 14 కోట్ల మంది యూదులు అనుసరించే జుడాయిజం ఉంది. ఇజ్రాయెల్, యూరప్, కెనడా, లాటిన్ అమెరికాలో యూదులు ఉన్నారు. ఆ తర్వాత ఎనిమిదో స్ధానంలో చైనీయులు అనుసరించే టావోయిజం ఉంది. చైనాతో పాటు తైవాన్ లో కొందరు దీన్ని అనుసరిస్తున్నారు. తొమ్మిదో స్ధానంలో 60 లక్షల మంది అనుచరులతో కన్ ఫ్యూషియస్ స్థాపించిన కన్ ఫ్యూషియనిజం ఉంది. పదో స్ధానంలో 4.4 లక్షల మంది అనుచరులతో వియత్నాంలో అనుసరించే కావోడియజం ఉంది.































