హీటెక్కిన రాప్తాడు. పరిటాల కుటుంబంపై తోపుదుర్తి ఫైర్?

రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయాలు భగ్గుమన్నాయి


రాప్తాడు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎంపీపీ/జడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా రాజకీయ ఘర్షణలు తీవ్రమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వ నేతలు, అధికారులు వైసీపీ సభ్యులను ఇబ్బంది పరిచినట్లు తెలిసింది. ఇదే విధమైన సంఘటన రామగిరి మండలంలోనూ జరగడంతో, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అధికారుల వైఖరి, పరిటాల కుటుంబం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా రిజర్వ్ సీటు అయినా హింసకు గురైన వైసీపి సభ్యులు

రామగిరి ఎంపిపి స్థానం మహిళలకు రిజర్వ్ అయినప్పటికీ, ఇక్కడి పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. మొత్తం 9 మంది ఎంపిటిసి సభ్యుల్లో 8 మంది వైసీపికి చెందినవారు. టిడిపి వైపు పోటీ చేయడానికి కూడా ఒక్క మహిళా సభ్యురాలు లేని స్థితిలో, పరిటాల కుటుంబం వెయ్యి మంది గూండాలను ఎంపిడిఓ కార్యాలయం చుట్టూ మోహరించిందని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఎస్పి, డిఎస్పి శాంతిభద్రతలు నియంత్రించడానికి ప్రయత్నించినా, స్థానిక ఎస్ఐ సుధాకర్ యాదవ్ టిడిపి గూండాలతో కలిసి అరాచకాలు సృష్టించారని ఆయన ఆరోపణలు చేశారు.

వైసీపి సభ్యులపై బలవంతపు చర్యలు

వైసీపి ఎంపిటిసి సభ్యులను బెదిరించడమే కాకుండా, వారిని బలవంతంగా కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నించారని ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రత్యేకంగా పేరూరు-2కు చెందిన వైసీపి ఎంపిటిసి సభ్యురాలు భారతిని బలవంతంగా ఎత్తుకెళ్లిన సంఘటనను ప్రస్తావిస్తూ, “మీరెందుకు వైసీపికి ఓటు వేస్తున్నారు? మీకు బుద్ధి లేదా? మా వెంట రావాలి!” అని టిడిపి గూండాలు, రౌడీలు సభ్యులను బెదిరించారని ఆరోపించారు. ఈ మొత్తం సంఘటనను సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పరిటాల కుటుంబం తప్పకుండా ఈ చర్యలకు మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు.

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు

ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి పోలీసులతో వాదులాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “సహనం నశిస్తే ఇలాంటి తిరుగుబాట్లు మొదలవుతాయి” అనే సందేశంతో వైసీపీ కార్యకర్తలు ఈ వీడియోలను మరింత ప్రచారం చేస్తున్నారు.