మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షాలు – పాఠశాలలకు రేపు సెలవు, రైళ్ల రాకపోకలకు అంతరాయం

తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల వరద ఏరులై పారుతోంది. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరద దాటికి కార్లు కొట్టుకుపోయాయి.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలాచోట్ల వరద ఏరులై పారుతోంది. పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా జిల్లాల యంత్రాగాలు సహాయక చర్యలు చేపట్టాయి.


కామారెడ్డిని ముంచెత్తిన వరదలు…

భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా అంతా అతలాకుతమవుతోంది. జిల్లాలోని చాలాచోట్ల వరద ఏరులై పారుతోంది. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు కాలనీల్లో కార్లు కొట్టుకుపోయాయి.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు రేపు(ఆగస్ట్ 28) సెలవు ప్రకటించారు. మరోవైపు కామారెడ్డి -భిక్కనూర్‌ మార్గంలో రైలు పట్టాల కింద వరద భారీగా పారుతోంది. గండిపడటంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. బొగ్గు గుడిసె సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నారు. పలువురు కార్మికులు వరదలో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో అత్యధికంగా 32 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి హౌసింగ్‌ బోర్డ్ కాలనీలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వరదలతో పట్టణ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హావేలిఘనపూర్ మండలం ధూప్‌సింగ్ తండాను వరద ముంచెత్తింది. తండా వాసులు భవనాల పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇండ్లు ఎక్కి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. వీరిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

తిమ్మాయిపల్లి, నాగపూర్‌, వాడి గ్రామాలను వరద ముంచెత్తింది. ఇళ్లను ముంచెత్తి రోడ్లపైకి వరద నీరు ప్రవహిస్తోంది. పిల్లికొట్టాల్‌లో సబ్‌ స్టేషన్‌ నీటమునిగింది. మెదక్‌ జిల్లా కేంద్రంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలుచోట్ల రైళ్లను దారి మళ్లించారు. అక్కన్నపేట-మెదక్‌ సెక్షన్‌ పరిధిలో పలు రైళ్లను మళ్లించారు. ముంబై – లింగంపల్లి, లింగంపల్లి – ముంబై, ఓఖా – రామేశ్వరం, భగత్ కి కోఠి – కాచిగూడ, నిజామాబాద్‌ – తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు.

సీఎం రేవంత్ సమీక్ష – సీఎస్ కు కీలక ఆదేశాలు

కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా ఎదుర్కునేందుకు అన్ని విభాగాలను, అధికారులను సర్వసన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. వెంటవెంటనే అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాల సాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.