ఓనం దక్షిణ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. మలయాళంలో తిరువోణం అని కూడా పిలుస్తారు. 10 రోజుల పాటు జరిగే ఓనం ఆనందం, సాంస్కృతిక వ్యక్తీకరణ , భక్తికి ప్రతీక.
2025లో ఓనం వేడుకల్లో ముఖ్యమైన రోజు సెప్టెంబర్ 05
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి ఎంత ప్రధాన పండుగో మలయాళీలకు ఓనమ్ అంతే ప్రత్యేకం. మలయాళీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే ఓనంకు 1961 లో జాతీయ పండగగా గుర్తింపు లభించింది. ఆగష్టు 26న ప్రారంభమైన ఓనం వేడుకలు సెప్టెంబర్ 7న చతయంతో ముగుస్తాయి. సెప్టెంబర్ 5 అత్యంత ముఖ్యమైన రోజు.
వామన జయంతి
ఈ పండుగ మలయాళ నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది. మహాబలిని గౌరవిస్తూ పండుగ జరుపుకుంటారు. రాక్షస రాజు అయిన బలిచక్రవర్తిని భూమి మీదకు ఆహ్వానిస్తూ 10 రోజుల పాటు జరుపుకునే పండుగ ఇది. మహాబలి పరిపాలన అంటే మలయాళీలకు స్వర్ణయుగం. అందుకే బలి అంటే మలయాళీలకు అంతులేని గౌరవం. ఆయన పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లారని చెబుతారు. ఈ గౌరవార్థం రంగు రంగు పూలతో బలికి స్వాగతం పలుకుతారు. ఈ పండుగను కొన్ని రాష్ట్రాల్లో వామన జయంతిగా జరుపుకుంటారు
భక్త ప్రహ్లాదుడి మనవడు బలి చక్రవర్తి
శ్రీ మహావిష్ణువు పరమ భక్తుడు , హిరణ్య కశిపుడి తనయుడై ప్రహ్లాదుడి మనవడే బలి చక్రవర్తి. తాతయ్య ప్రహ్లాదుడి ఒడిలో పెరిగిన బలి సకల విద్యలు నేర్చుకున్నాడు. మహారాజుగా పట్టాభిషేకం తర్వాత విశ్వజిత్ యాగం చేసి ఇంద్రలోకాన్ని ఆక్రమించాలని దండెత్తాడు. బలిని ఎలా ఆపాలో అర్థంకాక దేవతలంతా శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. దశావతారాల్లో భాగంగా తాను స్వయంగా అదితి అనే రుషిపత్ని ఇంట జన్మించి బలి అహంకారాన్ని తొక్కేస్తానని చెప్పాడు విష్ణువు. అలా వామనుడిగా జన్మించి బలిని మూడు అడుగులు అడిగి భూమి, ఆకాశాన్ని ఆక్రమిస్తాడు వామనుడు. మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళానికి తొక్కేస్తాడు. అయితే బలి దానగుణానికి , పాలనకు మెచ్చి ఏడాదికోసారి భూమ్మీదకు వచ్చి రాజ్యాన్ని చూసుకోమని వరమిచ్చాడు విష్ణువు. అలా బలి భూమ్మీదకు వచ్చే రోజు ఓనం. ఈ రోజు తన రాజ్యంలో ప్రజలంతా ఎంత సంతోషంగా ఉన్నారో చూసి ఆనందపడతాడట బలి చక్రవర్తి.
ఓనం సమయంలో ఇళ్ళు , లోగిళ్లు పూల తివాచీలు పరిచినట్టు ఉంటాయి.
ఆహారం: సాంప్రదాయ ఓనం సాధ్య, అరటి ఆకుల్లో వడ్డించే గొప్ప శాఖాహార విందు
సాంప్రదాయ సంగీతం ,నృత్యం: కథాకళి, పులికాలి (పులి నృత్యం), తిరువాతీర కలి వంటి ప్రదర్శనలు కేరళ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని హైలైట్ చేస్తాయి.
పండుగ ఆటలు: పడవ పోటీలు, రంగురంగుల ఊరేగింపులు
ఏనుగులు: అందంగా అలంకరించిన ఏనుగులు వేడుకలకు ఆనందాన్ని జోడిస్తాయి































