అమీన్‌పూర్‌లో విషాదం, నిద్రలోనే ముగ్గురు పిల్లల కన్నుమూత

తుకుదెరువు కోసం ఆ దంపతులు వలస వచ్చారు. ముగ్గురు పిల్లలతో అప్పటిదాకా సంతోషంగానే జీవించారు. ఏం జరిగిందో తెలియదు.. అభం శుభం తెలియని ఆ బిడ్డలు విషం కలిపిన అన్నం తిని నిద్రిలోనే తుదిశ్వాస విడిచారు.


అమీన్ పూర్(Ameenpur) మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి ఉంటున్నాడు. స్థానికంగా వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. భార్యా, ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత(Wife Rajitha) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా భర్త చెన్నయ్య చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురు పిల్లలు నిద్రలోనే మృతి చెందారని నిర్ధారించుకున్నారు. సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8)గా పేర్లను ప్రకటించారు. భర్త చెన్నయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

కాగా, ఈ ఘటనలో చిన్నారుల మృతిలో ఎలాంటి నిర్ధారణకు రాలేదని సంగారెడ్డి ఎస్పీ పంకజ్ ప్రకటించారు. తల్లి విషం ఇచ్చి చంపారన్న విషయం ధృవీకరణ కాలేదని.. కుటుంబ కలహాలతోనే ఘాతుకం జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని మీడియాకు తెలిపారు. ప్రస్తుతానికి రజిత ఆరోగ్యం నిలకడగానే ఉందన్న ఎస్పీ.. ఫోరెన్సిక్ నిపుణులు శాంపిల్స్ సేకరించారని, పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టంలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు.