ఓ స్టేషన్ నుంచి బయలుదేరేలా రిజర్వేషన్ చేయించుకొని, తర్వాతి స్టేషన్లలో రైలు ఎక్కి.. నా బెర్త్ ఇతరులకు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించడం ఇకపై కుదరదు.
రైలులో రిజర్వేషన్ వివరాలను ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)లు కొంత కాలంగా హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ (ట్యాబ్స్ వంటివి) ద్వారా పరిశీలిస్తున్నారు. వాటిలో ఎప్పటికప్పుడు వివరాలు అప్‌లోడ్ అవుతాయి. ఓ స్టేషన్‌లో రిజర్వేషన్ చేసుకున్నవారు రైలు ఎక్కకపోతే.. తర్వాత స్టేషన్ వచ్చేలోపు ఆర్‌ఏసీ, వెయింటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి ఆ బెర్త్‌లు కేటాయించే వీలుంటుంది.
దీంతో తర్వాత స్టేషన్‌లో రైలెక్కి నా బెర్త్ ఏదీ? అని అడిగేందుకు ప్రయాణికులకు హక్కు ఉండదు. గతంలో టీటీఈలకు ప్రింటెడ్ రిజర్వేషన్ జాబితా ఇచ్చేవారు. దీంతో ఒకటి, రెండు స్టేషన్ల వరకు ప్రయాణికులు రాకపోయినా వారు వేచి చూసేవారు. ఇప్పుడు అటువంటి అవకాశం లేదు. వచ్చే స్టేషన్‌లో రైలు ఎక్కాలనుకుంటే.. బోర్డింగ్ వివరాలు మార్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.