స్టార్ హోటల్స్‌లో పనిచేసే చెఫ్‌లతో మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీ మహిళలకు ట్రైనింగ్

ఏపీలో మరికొద్ది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జూన్ 12వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనం మరింత రుచికరంగా అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా స్టార్ హోటల్స్‌లో పనిచేసే చెఫ్‌లతో మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీ మహిళలకు ట్రైనింగ్ అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి.. విజయవాడలో తాజ్ హోటల్‌ చెఫ్‌లు వంట ఏజెన్సీ మహిళలకు శిక్షణ ఇచ్చారు. పప్పు, వెజ్ కర్రీ, పులిహోరా, వెజ్ బిర్యానీ, పొంగల్, పప్పుచారు వంటి వంటకాల తయారీపై ట్రైనింగ్ ఇచ్చారు.


మరోవైపు మధ్యాహ్న భోజనంలో భాగంగా పౌష్టికాహారం సిద్ధం చేసేందుకు తిరుపతిలోని తాజ్ హోటల్‌కు చెందిన నిపుణులైన చెఫ్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరంతా.. మధ్యాహ్న భోజన కార్యక్రమం మెనూ కోసం వివిధ ఐటెమ్‌ల తయారీపై కొన్ని సూచనల వీడియోలను సిద్ధం చేశారు. ఈ వీడియోలలో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలను ఎలా తయారు చేయాలో వివరించడమే కాకుండా… వాటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా చెఫ్‌లు వివరిస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నిర్వహించే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈ వీడియోలను అప్‌లోడ్ చేశారు.

మరోవైపు స్కూలు ప్రధానోపాధ్యాయులు వీటిని డౌన్‌లోడ్ చేసి.. మధ్యాహ్న భోజనం తయారుచేసే ఏజెన్సీ నిర్వాహకులకు షేర్ చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. స్మార్ట్ ఫోన్లు లేని వారికి.. పాఠశాల సమయం ముగిసిన తర్వాత స్కూలు తరగతి గదిలో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీలను ఉపయోగించి వీడియోలను చూపించాలని తెలిపారు. మొత్తం 44 వేల 190 పాఠశాలల్లో ఒకే రకమైన రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు.