ఏపీలో సమస్యాత్మక నియోజకవర్గాలివే: 100 శాతం వెబ్‌క్యాస్టింగ్, భారీగా బలగాల మోహరింపు

www.mannamweb.com


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించింది. ఆ నియోజకవర్గాల్లో భారీగాకేంద్ర బలగాలను మోహరించడంతోపాటు ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది ఎన్నికల సంఘం. దీంతోపాటు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా పేర్కొంది.

వీటితోపాటు ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ సెంట్రల్, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, అన్నమయ్య జిల్లాలోని పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది. గతంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు, అల్లర్ల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌క్యాస్టింగ్ జరుగుతుంది. సీఏపీఎఫ్ బలగాలతోపాటు రాష్ట్ర పోలీసులు భారీగా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించనున్నారు. జిల్లా కలెక్టర్లు లేదా ఎన్నికల అధికారులు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

మే 13న జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.

మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు ఎన్నికల అధికారులు. కాగా, రాష్ట్రంలో 29,897 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్​​కుమార్​మీనా గురువారం వెల్లడించారు. రాష్ట్రంలో 12,438 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రంలో 64 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేయాలన్నారు. 14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్‌కాస్టింగ్‌ చేయాలని కేంద్ర పరిశీలకులు సిఫార్సు చేశారని తెలిపారు.