Trump: ‘నన్ను జైలుకు పంపితే..’ ట్రంప్‌ పరోక్ష హెచ్చరిక!

వాషింగ్టన్‌: తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అన్నారు. దేనికైనా ఒక పరిమితి ఉంటుందని.. అలాగే తనని అభిమానించేవారికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని వ్యాఖ్యానించారు. తనని జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు, హింసాత్మక ఘటనలు తప్పకపోవచ్చని పరోక్షంగా సంకేతమిచ్చారు. తనకు మాత్రం వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు.


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని యత్నిస్తున్న రిపబ్లికన్‌ పార్టీ నేత ట్రంప్‌నకు కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. శృంగార తార స్టార్మీ డానియల్స్‌కు డబ్బు చెల్లింపు, దానికోసం రికార్డులను తారుమారు చేశారనే వ్యవహారంలో (Trump Hush Money Case) న్యూయార్క్‌ కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. మొత్తం 34 అభియోగాల్లో ట్రంప్‌ను దోషిగా తేల్చింది. జులై 11న శిక్ష ఖరారు చేయనుంది. ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కారు.

ఆవేదనలో మెలానియా..
ట్రంప్‌నకు జైలు శిక్ష పడొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దానిపై తొలిసారి స్పందించిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తనపై నేరారోపణలు, న్యాయపరమైన చిక్కుల వల్ల సతీమణి మెలానియా ట్రంప్‌ తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్లు తెలిపారు. మొత్తం కుటుంబంపైనా ఈ వ్యవహారం ప్రభావం చూపుతోందని వెల్లడించారు. తన కంటే తన కుటుంబమే ఎక్కువ క్షోభ అనుభవిస్తోందని చెప్పుకొచ్చారు.

స్టార్మీ డానియల్స్‌ తొలి స్పందన..
ట్రంప్ దోషిగా తేలడంపై స్టార్మీ డానియల్స్‌ తొలిసారి స్పందించారు. ఇంత త్వరగా తీర్పు వెలువడటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయనకు జైలు శిక్ష విధించాలని కోరారు. పేదవారికి సేవ చేసే బాధ్యతను అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ట్రంప్‌ దోషిగా తేలినంత మాత్రాన తనకు ఈ కేసు ముగిసినట్లు కాదని వ్యాఖ్యానించారు. ‘‘ఆయనకు అపరాధ భావన ఉండొచ్చు. నేను మాత్రం ఆ మచ్చతోనే జీవితాన్ని గడపాలి’’ అని అన్నారు.

టిక్‌టాక్‌లోకి ట్రంప్‌..
ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌లో ట్రంప్‌ ఖాతా తెరిచారు. దీన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. నెవార్క్‌లో జరిగిన ‘‘అల్టిమేట్‌ ఫైటింగ్‌ ఛాంపియన్‌షిప్‌’’ వేదిక నుంచి ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. అందులో ఆయన తన అభిమానులకు అభివాదం చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ కనిపించారు. శనివారం సాయంత్రం ఈ వీడియోను పోస్ట్‌ చేయగా.. ఆదివారం ఉదయానికల్లా ఆయన టిక్‌టాక్‌లో 1.1 మిలియన్‌ ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఆ వీడియోకు 1 మిలియన్‌ లైక్స్‌, 24 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లకు చేరువకావడానికి దీన్నొక అవకాశంగా భావిస్తున్నట్లు ట్రంప్‌ అధికార ప్రతినిధి స్టీవెన్‌ చెంగ్‌ తెలిపారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టిక్‌టాక్‌ను నిషేధించే దిశగా ట్రంప్‌ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.