TS Cabinet Meet: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే
హైదరాబాద్: ఎన్నికల సంఘం షరతుల మేరకు నిర్వహించిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ భేటీలో సుమారు 4 గంటలపాటు పలు అంశాలపై మంత్రులు చర్చించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సోనియా గాంధీని తెలంగాణకు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే సీజన్ నుంచి సన్నవడ్లపై రూ.500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా కొనసాగేందుకు కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు. రేపటి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సబ్‌కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని మంత్రులు తెలిపారు. ఇక నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. రైతులు లూజు విత్తనాలు కొనొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
మరోవైపు విద్యకు పెద్దపీట వేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా స్కూళ్ల నిర్వహణ చేపట్టేందుకు కేబినెట్ నిర్ణయించిందని మంత్రలు వెల్లడించారు. జూన్ 12 స్కూళ్లు ప్రారంభమయ్యే సమయానికి తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇక జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించింది.
రాష్ట్ర అవతరణ వేడుకలకు కేసీఆర్‌కు ఆహ్వానం: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం తరపున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పాఠశాలలు పున:ప్రారంభమయ్యే జూన్ 12 లోగా విద్య వ్యవస్థలో మార్పులు చూపించాలని కెబినెట్ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ‘‘మంత్రి వర్గ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ధాన్యం కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా తీసుకుంటాం. మూడు రోజుల్లో పేమెంట్ అయ్యేలా చూస్తాం. స్టాండింగ్ క్రాప్ అంశంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. వ్యవసాయ శాఖ మంత్రి అకాల వర్షాలపై సమీక్షిస్తున్నారు. విద్య వ్యవస్థకు సంబంధించి అన్ని చర్యలు పక్కాగా ఉంటాయి. పాఠశాల, సాంకేతిక, హై యర్ ఎడ్యుకేషన్‌ను గత ప్రభుత్వం విస్మరించింది. బోధన, బోధనేతర అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో మానవ వనరులపై సమీక్ష నిర్వహిస్తాం. ఇందుకోసం రూ.600 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది’’ అని శ్రీధర్ బాబు తెలిపారు.
ఇక మేడిగడ్డ అంశంలో ఎన్‌డీఎస్ఏ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళతామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కేవలం సాంకేతిక పరమైన నిర్ణయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా అన్ని అంశాలను ఇంజనీర్లతో మాట్లాడి ముందుకు వెళతామని తెలిపారు. మెడిగడ్డ, అన్నారం , సుందిళ్ళలను సందర్శిస్తామని ఆయన తెలిపారు.
ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ‘‘ ధాన్యం కొనుగోలు అన్ని చోట్లా జరుగుతుంది. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల చేయాల్సి ఉంది. ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ చేసినవి అన్నీ డ్రామాలు. పదేళ్లు మీరు రైతుల కోసం ఏం చేశారో తెలుసు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరుతాం. డీఎస్సీ నోటిఫికేషన్‌పై మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. గత పదేళ్లు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. కేబినెట్ భేటీకి సంబంధించిన చాలా అంశాలను జూన్ 5 న తెలియజేస్తాం. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తాం’’ అని అన్నారు.