TTD: శ్రీవారి ఆలయంలో మరో అపచారం.. మండిపడుతున్న భక్తులు!

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొలువైన చోట పదే పదే అపచారం జరుగుతుంది. ఆనంద నిలయం మీదుగా మళ్లీ విమానాలు వెళ్తుండడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోరా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయం పై విమానాల రాకపోకలు ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువైపోయాయి. ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ప్రతిరోజు శ్రీవారి ఆలయం మీద నుంచి విమానాలు వెళ్తుండడం పట్ల భక్తుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలనే డిమాండ్ కొత్తేం కాదు.గురువారం ఒక్కరోజే ఆలయం మీదుగా 8 విమానాలు వెళ్లడం గమనార్హం.
ఈ అంశం పై కేంద్రానికి పలుమార్లు తిరుమల తిరుపతి దేవస్థానం , ప్రభుత్వాలు లేఖలు రాసినా స్పందన లేకుండా పోయింది.తిరుపతిలో విమానాల రాకపోకలకు అంతరాయం కలగొచ్చంటూ కేంద్రం అప్పట్లో వివరణ ఇచ్చుకుంది.గతంలో టీడీపీ తరుఫున అశోక గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది.కానీ అప్పుడు అడుగులు ముందుకు సాగలేదు.


ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయో కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో పాటు రాష్ట్రానికి చెందిన రామ్మోహన్ నాయుడు విమానాయాన శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సానుకూల స్పందన రావొచ్చని భక్తులు అనుకున్నారు.కానీ అది జరగడం లేదు. తాజాగా విమానాయాన శాఖ మంత్రికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ లేఖ రాశారు. తిరుమల పై విమాన రాకపోకలు నిషేధించాలని లేఖలో కోరారు.

ఈ లేఖకు మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. తిరుమలకు నో ఫ్లయింగ్ జోన్ ఇవ్వడం సాధ్యం కాదని, అలాంటి హోదా ఇవ్వడానికి నిబంధనలు లేవని పేర్కొన్నారు. పైగా దేశంలో ఇప్పటికే చాలా ఆధ్యాత్మిక ప్రాంతాల నుంచి ఇలాంటి వినతులు వస్తున్నాయని చెప్పారు.అయితే తిరుమల గగనతలం పైకి విమానాలు రాకుండా,ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ,నావిగేషన్ విభాగాలతో చర్చించి చర్యలు తీసుకుంటాం అని మాత్రం హామీ ఇచ్చారు.

ఆ హామీ ఇచ్చినప్పటికీ ..ఇప్పుడు మళ్లీ విమానాలు తిరుగుతున్నాయి. ఇంతటి అపచారం జరుగుతున్నా..తిరుమలను ఫ్లయింగ్జోన్ గానే కొనసాగిస్తారా? అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దేవాలయాలపైన ఎవరూ సంచరించకూడదని అగమశాస్త్రం చెబుతోంది.ఆలయాలు ఉన్నత ప్రాంతాలు.భగవంతుడి కంటే ఎత్తులో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు.దైవానికి నివేదన చేసేటప్పుడు ..గంటానాదం,ఢమరుకం,వాయిద్యాలు తప్పించి..మరేయితర శబ్దాలు వినిపించకూడదు .అలా జరిగితే అది అపచారం.

కావున అగమశాస్త్రం ప్రకారం విమానాలు,రాకెట్లు ఆలయం మీదుగా వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు.