TTD | శుభవార్త చెప్పిన టీటీడీ..! వారి కేవలం అరగంటలోనే శ్రీవారి దర్శనం..!

TTD | తిరుమల శ్రీవారి దర్శానికి వేలాది మంది భక్తులు నిత్యం తరలివస్తుంటారు. చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శానికి బారులు తీరుతుంటారు.


స్వామివారి దర్శనానికి గంటల పాటు క్యూలైన్లలో బారులు తీరాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే, ముఖ్యంగా వృద్ధులు క్యూలైన్లలో అవస్థలు పడుతుంటారు. అయితే, ప్రత్యేకంగా వృద్ధులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్‌ విధానం గురించి ఎక్కువ మందికి అవగాహనలేకపోవడంతో తిప్పలుపడుతున్నారు. తాజాగా కొలువుదీరిన కొత్త ప్రభుత్వం టీటీడీ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేసింది.

ఈ క్రమంలో సీనియర్‌ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు రెండు టైమ్‌ స్లాట్స్‌ను ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో వృద్ధులు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. దర్శానికి వెళ్లే వృద్ధులు తమ ఫొటో ఐడీకార్డులు (ఆధార్ లేక ఇతర డాక్యుమెంట్లు)తో వయస్సు రుజువులను ఎస్-1 కౌంటర్‌లో అందజేయాల్సి ఉంటుంది.

వృద్ధులు ఎక్కువగా నడవాల్సిన అవసరం లేకుండా, మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా బయట గ్యాలరీ నుంచి ప్రవేశం కల్పించనున్నది. వారి కోసం సీటింగ్‌ సౌకర్యం సైతం అందుబాటులోకి తీసుకురానున్నది. క్యూలైన్లలో వృద్ధులకు సాంబార్ అన్నం, పెరుగు అన్నం, వేడి పాలు సైతం అందిస్తారు. క్యూలైన్లలో వృద్ధులకు ప్రతిదీ ఉచితమేనని టీటీడీ వర్గాలు తెలిపాయి. వృద్ధులకు తక్కువ ధరకే
రెండు లడ్డూలు సైతం అందించనున్నారు.

కేవలం రూ.20 చెల్లించి రెండు లడ్డూలు పొందే అవకాశం ఇస్తున్నది. అదనంగా లడ్డూల కోసం ఒక్కో దానికి రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఆలయం ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి, కౌంటర్ వద్ద వృద్ధులను డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రత్యేక దర్శనం సమయంలో అన్ని ఇతర దర్శనాలను నిలిపివేయనున్నారు. కేవలం వృద్ధులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఎలాంటి ఒత్తిడి లేకుండానే వృద్ధులు శ్రీవారి దర్శనం చేసుకోనేలా వీలు కల్పించనున్నది. వివరాల కోసం టీటీడీ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ 08772277777 సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది.