రెండు తెలుగు రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యి.. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. ఇప్పుడు విద్యార్థులంతా భవిష్యత్తులో చదవబోయే కోర్సుల గురించి తెలుసుకునే పనిలో ఉన్నారు. ఏ కోర్సు చదివితే మంచిది.. భవిష్యత్తులో దేనికి డిమాండ్ ఉంటుంది అనే అంశాల గురించి తెలుసుకునే పనిలో ఉన్నారు. అలానే కొందరు విద్యార్థులు ఇప్పుడు లభించిన ఖాళీ టైమ్‌ను సద్వినియోగం చేసుకునేందుకు వివిధ కోర్సుల్లో చేరతారు. స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ బేసిక్ కోర్సులను నేర్చుకుంటారు. అలానే కొన్ని విద్యా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపిందిస్తాయి. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
పదో తరగతి పాసైన విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శిల్పకళ మీద ఆసక్తి ఉన్న విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్ కల్పిస్తోంది. ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలనడుస్తోంది. అయితే.. ఈ కళాశాలలో చేరాలనుకునేవారికి టీటీడీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. 2024-25 విద్యాసంవత్సరానికి సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. 10వ తరగతి పాసైన వాళ్లు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. డిప్లొమా కోర్సు వ్యవధి నాలుగేళ్లు కాగా.. సర్టిఫికేట్ కోర్సు వ్యవధి రెండేళ్ల వ్యవధిగా నిర్ణయించారు. ఈ కోర్సులకు ఎంపికైతే ఉచిత భోజనం, వసతి కూడా కల్పిస్తోంది టీటీడీ. అంతే కాదు శిక్షణ పూర్తైతే లక్ష రూపాయలు కూడా అందిస్తోంది.
వీటిపై ఆసక్తి గల విద్యార్థులు డిప్లోమా, సర్టిఫికేట్ కోర్సుల్లో చేరడానికి అప్లై చేసుకోవాలని టీటీడీ సూచించింది. దరఖాస్తు ప్రక్రియ మే 1 నుంచి ప్రారంభవుతుందని తెలిపింది. జూన్ 17 వరకు కాలేజీలో అప్లికేషన్ ఫామ్‌లు అందుబాఉలో ఉంటాయని టీటీడీ వెల్లడించింది. విద్యార్థులు జూన్ 17వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తులను కాలేజీలో ఇవ్వాలని సూచించింది. కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి. లేదంటే కాలేజీ ఆఫీస్ నంబర్లు 0877-2264637, 9866997290 సంప్రదించాలని టీటీడీ సూచించింది. మరి ఈ కోర్సులపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.