TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా జె.శ్యామలరావు బాధ్యతల స్వీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా జె.శ్యామలరావు నియమితులైన సంగతి తెలిసిందే. టీటీడీ ఈవోగా ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఆయన సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. శ్యామలరావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.


గత ప్రభుత్వ హాయాంలో టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై అనేక ఆరోపణలు రావడంతో ఆయన్ను ప్రస్తుత ప్రభుత్వం తప్పించింది. జె.శ్యామలరావును నియమిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ధర్మారెడ్డిని గత ప్రభుత్వం టీటీడీ అదనపు ఈవోగా నియమించింది.

ఆ తర్వాత ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. వైసీపీ ప్రభుత్వం ఓటమి తర్వాత తనకు సెలవు కావాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ఖరారు అయిన తర్వాత ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు ఆయనకు సెలవు మంజూరు చేసింది.

అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మారెడ్డి రిటైర్మెంట్‌ దగ్గరలో సెలవు పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెలవు ముగిసిన తర్వాత ఆయన విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

1997 బ్యాచ్‌కు చెందిన శ్యామలరావును డీవోపీటీ తొలుత అసోం కేడర్‌కు కేటాయించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా తనను అసోం కేడర్‌కు పంపారని, తన ర్యాంక్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు కేటాయించాలని క్యాట్‌లో పోరాటం చేశారు. కొంతకాలం అసోంలో పనిచేశాక 2009లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. విశాఖ కలెక్టర్‌గా, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లయ్‌ ఎండీగా పనిచేశారు. నేడు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.