రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రెండు చరిత్రాత్మక బిల్లులను ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుంది. వీటికి ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలపడంతో బిల్లులకు శాసనసభ ఆమోదం తీసుకోనుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభ, మండలిలో సోమ, మంగళవారాల్లో ప్రత్యేక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం సామాజిక, ఆర్థిక కుల సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం బీసీలతోపాటు కులాలవారీగా జనాభా లెక్కలు వెల్లడయ్యాయి. బీసీల జనాభా ప్రకారం సామాజిక న్యాయం కల్పించేందుకు వారి రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29% అమలవుతున్నాయి. ఇందులో బీసీలకు 25%, ముస్లింలకు బీసీ-ఈ కింద 4% ఉంది. 42 శాతానికి పెంచేందుకు బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బీసీ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం అసెంబ్లీ హాల్‌లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఎస్సీ వర్గీకరణకు అంతా సిద్ధం
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్రంలోనూ వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో న్యాయ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదికలో ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరణ చేయాలని పేర్కొంది. ఈ వివరాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. అయితే గ్రూపుల వర్గీకరణపై మరికొన్ని కుల సంఘాల నుంచి అభ్యంతరాలు, సూచనలు రావడంతో వాటిని పరిశీలించాలని కమిషన్‌ను సర్కారు కోరింది. వాటిని పరిశీలించిన కమిషన్ తాజాగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఆ మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు సిద్ధమైంది.