ఏపీలో కాంగ్రెస్ ఒంటరి కాదు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీతో మరో రెండు జాతీయ పార్టీలు పొత్తు పెట్టుకోనున్నాయి. ఈ విషయాన్ని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ తెలిపారు.
ఇండియా కూటమిలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదుర్చుకుని ఒక సీటులో పోటీ చేసి గెలుపొందింది. సీపీఎం ఎక్కువ ఆశించి భంగపడింది. ఏపీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోడానికి సిద్ధపడ్డాయి. సీపీఐ నాయకుడు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ అడుగులకు చంద్రబాబు, జగన్ మడుగులొత్తుతున్నారని విమర్శించారు.
ఏపీలో టీడీపీ, వైసీపీలకు వ్యతిరేకంగా పోటీ చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని సీపీఐ, సీపీఎం ఎన్నికల బరిలో దిగుతామని ఆయన తెలిపారు. నిజానికి టీడీపీతో అవగాహన కుదుర్చుకుని ఎన్నికల బరిలో దిగాలని సీపీఐ ఆలోచించింది. అయితే బీజేపీతో చంద్రబాబు అంటకాగుతుండడంతో పొత్తు సాధ్యం కాదనే నిర్ణయానికి సీపీఐ వచ్చింది. అందుకే ఇప్పుడు యూటర్న్ తీసుకుని మళ్లీ టీడీపీ, వైసీపీలను విమర్శించడం మొదలు పెట్టారు.
ఏపీలో షర్మిల రాకతో కాంగ్రెస్‌కు ఆదరణ పెరిగిందని ఇతర పార్టీలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలకు వెళితే… టీడీపీ, వైసీపీలను తూర్పారపట్టొచ్చని వామపక్షాలు అనుకుంటున్నాయి. అయితే ఇప్పటికే 20 నుంచి 30 స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఎం నేతలు ప్రకటించారు. కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఎం ఏ మేరకు ముందుకొస్తుందో చూడాలి.