ఉబెర్, లూసిడ్, న్యూరోల సెల్ఫ్ డ్రైవింగ్ రోబోటాక్సీ.. డ్రైవర్ లేకుండానే ప్రయాణం

లాస్ వెగాస్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఈవెంట్ CES 2026 ఒక అద్భుతమైన ఆవిష్కరణకు వేదికైంది. భవిష్యత్తులో మనం ప్రయాణించే పద్ధతినే మార్చేసేలా.. ఉబర్ (Uber), లూసిడ్ (Lucid Group), న్యూరో (Nuro) సంస్థలు కలిసి తమ కొత్త ‘రోబోటాక్సీ’ని (Robotaxi) సోమవారం ప్రపంచానికి పరిచయం చేశాయి. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో డ్రైవర్ ఉండరు, అన్నీ సెన్సార్లే చూసుకుంటాయి.


మూడు దిగ్గజాల కలయిక

ఈ ప్రాజెక్టు కోసం మూడు దిగ్గజ సంస్థలు చేతులు కలిపాయి. లూసిడ్ గ్రూప్ తన అత్యంత శక్తివంతమైన ‘లూసిడ్ గ్రావిటీ’ (Lucid Gravity) ప్లాట్‌ఫారమ్‌ను వాహనంగా అందించగా.. న్యూరో సంస్థ అందులోని సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని (అటానమస్ సిస్టమ్) అభివృద్ధి చేసింది. ఇక ప్రయాణికులకు కారు లోపల కలిగే అనుభవాన్ని, సర్వీస్ నిర్వహణను ఉబెర్ చూసుకోనుంది.

ఎలా పనిచేస్తుంది? (360° నిఘా)

ఈ రోబోటాక్సీలో అత్యాధునిక సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో కెమెరాలు, సాలిడ్-స్టేట్ లిడార్ (Lidar), రాడార్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి వాహనం చుట్టూ 360 డిగ్రీల కోణంలో నిరంతరం నిఘా ఉంచుతాయి.

కారు పైభాగంలో ఉండే ఒక ప్రత్యేక ‘హాలో’ (Halo) మాడ్యూల్ దీనికి ప్రధాన ఆకర్షణ. ఇందులో ఉండే LED లైట్లు, ప్రయాణికులు తమ టాక్సీని సులభంగా గుర్తించడానికి సహాయపడతాయి. ఈ మొత్తం వ్యవస్థకు శక్తినిచ్చే మెదడు లాంటి కంప్యూటింగ్ ప్రాసెసర్‌ను NVIDIA DRIVE AGX Thor అందించింది.

ప్రయాణికులకు లగ్జరీ అనుభవం

డ్రైవర్ లేని కారులో కూర్చున్నప్పుడు కలిగే ఆందోళనను తగ్గించేలా ఉబెర్ దీని ఇంటీరియర్‌ను డిజైన్ చేసింది.

కంట్రోల్ మీ చేతుల్లోనే: కారు లోపల ఉండే స్క్రీన్ల ద్వారా ఏసీ టెంపరేచర్, సీట్ హీటింగ్, మ్యూజిక్ వంటివి మార్చుకోవచ్చు.

రియల్ టైమ్ విజువలైజేషన్: కారు ఏ మార్గంలో వెళ్తోంది, చుట్టుపక్కల ఉన్న వాహనాలను సెన్సార్లు ఎలా గుర్తిస్తున్నాయి అనేది స్క్రీన్ మీద ప్రత్యక్షంగా చూడొచ్చు.

ఆరుగురికి చోటు: ఇందులో డ్రైవర్ ఉండరు కాబట్టి, ఆరుగురు ప్రయాణికులు హాయిగా కూర్చోవచ్చు. లగేజీ కోసం కూడా భారీగా స్థలం ఉంది.

అత్యవసర సాయం: ప్రయాణంలో ఏవైనా సమస్యలు ఎదురైతే సపోర్ట్ టీమ్‌ను సంప్రదించడానికి లేదా కారును పక్కకు ఆపమని కోరడానికి సులభమైన ఆప్షన్లు ఉన్నాయి.

త్వరలోనే రోడ్ల మీదకు..

ఈ రోబోటాక్సీ ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో రోడ్డు పరీక్షలను (On-road testing) విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం భద్రతా కారణాల దృష్ట్యా ఒక మనిషి పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి.

“ప్రయాణికుల భద్రతే మా మొదటి ప్రాధాన్యత. అందుకే విభిన్న వాతావరణాల్లో, ట్రాఫిక్ పరిస్థితుల్లో ఈ వాహనాలను పరీక్షిస్తున్నాం” అని న్యూరో ప్రతినిధులు తెలిపారు. అన్నీ సజావుగా సాగితే, ఈ ఏడాది చివర్లో అరిజోనాలోని లూసిడ్ ఫ్యాక్టరీలో వీటి ఉత్పత్తి ప్రారంభమై, ఉబెర్ యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

భవిష్యత్తులో టాక్సీ కావాలంటే డ్రైవర్ కోసం వెతకక్కర్లేదు.. టెక్నాలజీయే మనల్ని గమ్యం చేరుస్తుందన్నమాట.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.