UGC-NET: యూజీసీ నెట్‌ పరీక్షకు త్వరలోనే కొత్త తేదీ: కేంద్ర విద్యాశాఖ

www.mannamweb.com


UGC-NET: విద్యార్థుల ప్రయోజనాలను రక్షించేందుకే యూజీసీ నెట్‌ జూన్‌-2024 పరీక్షను రద్దు చేశామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది.

దిల్లీ: ఈ ఏడాది జరిగిన యూజీసీ నెట్‌ జూన్‌-2024 (UGC-NET) పరీక్షలో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర విద్యాశాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సుమోటోగా చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ (Education Ministry) జాయింట్‌ సెక్రటరీ గోవింద్‌ జైశ్వాల్‌ గురువారం వెల్లడించారు. త్వరలోనే కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

‘‘నెట్‌ పరీక్ష (NET Exam)లో అవకతవకలు జరిగాయని, విశ్వసనీయత దెబ్బతిందని ఏజెన్సీలు ఇచ్చిన నివేదికతో మాకు అర్థమైంది. అందుకే పరీక్షను రద్దు చేశాం. ప్రస్తుతం దీనిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించినందుకు ఇంతకంటే వివరాలను మేం వెల్లడించలేం. త్వరలోనే మళ్లీ పరీక్షను నిర్వహిస్తాం. బాధ్యులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని జైశ్వాల్‌ వెల్లడించారు.

జూన్‌ 18వ తేదీన దేశంలోని అనేక నగరాల్లో ఓఎమ్మార్‌ (పెన్ను, పేపరు) విధానంలో యూజీసీ నెట్‌ (UGC NET) పరీక్ష జరిగింది. దీనిని ఎన్‌టీఏ రెండు షిఫ్టుల్లో నిర్వహించింది. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే భారతీయ సైబర్‌ నేర విచారణ సమన్వయ కేంద్రానికి (ఐసీసీసీసీ) చెందిన జాతీయ సైబర్‌ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం యూజీసీకి నివేదిక ఇచ్చింది. దీంతో పరీక్షను రద్దు చేశారు.

లీక్‌లు లేకుండా పరీక్షలు నిర్వహించలేరా?: కాంగ్రెస్‌
ఓవైపు నీట్‌ యూజీ పరీక్షలో అక్రమాలపై వివాదం కొనసాగుతున్న వేళ యూజీసీ నెట్‌ పరీక్షను రద్దు చేయడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాలు కేంద్రంపై ధ్వజమెత్తాయి. లీక్‌లు, మోసాలు లేకుండా మోదీ సర్కారు పరీక్షలు నిర్వహించలేకపోతోందంటూ ఎద్దేవా చేశాయి. ‘పరీక్షా పే చర్చా’ అంటూ హంగామా చేసే ప్రధాని.. ఈ లీక్‌లపై మాట్లాడుతారా? అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రశ్నించారు.