బిగ్ బాస్‌కు ఊహించని షాక్.. మహిళా కమిషన్ నోటీసులు.. కారణమిదే

www.mannamweb.com


ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షోలు రన్ అవుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ఇప్పటికే ఆరు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 ప్రారంభమై రెండు వారాలైంది. అయితే ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు రేగుతూనే ఉన్నాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రామనగర పోలీసులు బిగ్‌బాస్‌ మేకర్స్ కు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 ప్రారంభం నుంచే హౌస్ లో స్వర్గం- నరకం అనే కాన్సెప్ట్ నడుస్తోంది. . దీని ప్రకారం, మొదటి రోజు, కొంతమంది కంటెస్టెంట్‌లను స్వర్గానికి పంపారు. కొంతమంది పోటీదారులను నరకానికి పంపారు. నరకానికి వెళ్లిన కంటెస్టెంట్లు నేలపై వేసిన మంచంపై పడుకోవాల్సి వచ్చింది. వారికి ఆహారం బదులు గంజి మాత్రమే ఇస్తున్నారు. సీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. వారిని జైలు తరహా కడ్డీల వెనుక ఉంచారు. తాగునీటి కోసం ఒక కుండ మాత్రమే ఉంచారు. ఆహారం, నీరు, ఆఖరికి బాత్ రూమ్ వెళ్లాలనుకున్నా స్వర్గంలో ఉన్న కంటెస్టెంట్ల అనుమతిని అడగాలి. ఈ కాన్సెప్ట్ వల్ల వల్ల కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఇప్పుడిదే కాన్సెప్ట్ కొంతమంది సామాజిక కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. బిగ్ బాస్ హౌస్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇష్టానికి విరుద్ధంగా ఏ వ్యక్తిని నిర్బంధంలో ఉంచలేమని, బిగ్ బాస్ హౌస్ లో పౌష్టికాహారం, మరుగుదొడ్లు వంటి కనీస అవసరాలు కూడా కల్పించకుండా మానవ హక్కులను ఉల్లంఘించారని నాగలక్ష్మి ఆరోపించారు. స్వర్గం-నరకం అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు, కొంతమంది కంటెస్టెంట్లు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఆడవారి గురించి చెడుగా మాట్లాడేవారు. కొంతమంది పోటీదారులు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రకటనలు ఇచ్చారు. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి కూడా పోలీసులకు లేఖ రాశారు.

ఇప్పుడు ఇదే విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులకు రామనగరలోని కుంబాలఘోడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇన్‌స్పెక్టర్ మంజునాథ్ హూగర్ బిగ్ బాస్ వద్దకు వెళ్లి నిర్వాహకులకు నోటీసు జారీ చేసి, కొన్ని తేదీల ఫుటేజీని, దాని పూర్తి ఆడియోను అందించాలని కోరారు. ఎడిట్ చేయని రా వీడియోను పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా గతంలో కూడా బిగ్ బాస్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత బిగ్‌బాస్‌లో వర్తూరు సంతోష్‌ని అరెస్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుండి తీసుకెళ్లారు.