union budget 2025: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు వరాలు ఇవే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ​ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. పేదలు, యువత, రైతులు, మహిళలు ప్రధాన రంగాలే లక్ష్యంగా నిర్మలమ్మ బడ్జెట్ సాగింది.


పేదలు, యువత, మహిళలు,రైతుల కోసం 10 కీలక రంగాల్లో సంస్కరణలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 6 అంశాలు.. టాక్సేషన్, పవర్ సెక్టార్, అర్బన్ డెవలప్ మెంట్, మైనింగ్, అగ్రికల్చర్, రెగ్యూలేటరీ సంస్కరణలు.. అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు.

పట్టణ పేదల కోసం..

రూ. 30వేల పరిమితితో పట్టణ పేదలకోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో పేర్కొన్నారు. అంతేకాక ఎంఎస్ఎంఈ, మహిళలకూ రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ వర్గాల వారికోసం రుణాల పరిమితిని రూ. 5కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు పెంచినట్లు పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ రంగానికి రూ. 1.5లక్షలకోట్ల రుణాలను అందించనుంది. 27 రంగాల్లో స్టార్టప్ లకు రుణాలకోసం ప్రత్యేక కార్యాచరణ ఆవలంభించనుంది. ఎంఎస్ఎంఈలకు తొలి ఏడాది 10లక్షల వరకు క్రెడిట్ కార్డులు అందించనుంది కేంద్రం.

రూ. 12 లక్షల వరకు పన్ను లేదు..

దేశ అభివృద్ధిలో మిడిల్ క్లాస్ రంగం చాలా కీలకం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు వ్యక్తిగత ఆదాయపన్నుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.12లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపునిచ్చింది.

ఎస్సీ మహిళలకు రూ. 2కోట్ల రుణాలు..

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళల కోసం టర్న్ లోన్ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం కింద తొలిసారి సొంత వ్యాపారం చేయాలనుకునేవారికోసం వచ్చే ఐదేళ్లలో రూ. 2కోట్ల వరకూ రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఈ స్కీం వల్ల మొత్తం 5 లక్షల మందికి ప్రయోజనం కలుగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక దేశవ్యాప్తంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ పథకం వల్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

క్యాన్సర్ పేషంట్లకు గుడ్ న్యూస్..

క్యాన్సర్ ఇతర ప్రమాదకర వ్యాధుల మెడిసిన్లపై పూర్తిగా కస్టమ్స్ డ్యూటీని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రులు నెలకొల్పుతామన్నారు. 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగిస్తామని చెప్పారు.

పేద పిల్లల కోసం అటల్ టింకరింగ్ ల్యాబ్స్..

పేద విద్యార్థుల కోసం ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ మిషన్ తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకం కింద రాబోయే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 50 వేల పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నెలకొల్పుతామని చెప్పారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఇంటర్ నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అంతేకాక మెడికల్ విద్యను అందరికీ అందించే విధంగా వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75వేల కొత్త మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.