Jitan Ram Manjhi: కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య

పాట్నా: కేంద్రమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ (Jitan Ram Manjhi) మనవరాలు సుష్మాదేవి (Sushma Devi) దారుణ హత్య కలకలం రేపుతోంది. సుష్మాదేవిని ఆమె భర్త రమేష్‌ సింగ్‌ నాటు తుపాకీతో కాల్చి చంపాడు.


గయా ఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రం,గయా జిల్లా అటారి పోలీస్ స్టేషన్ పరిధిలోని తేటువా గ్రామానికి చెందిన జితన్‌ రామ్‌ మాంఝీ మనవరాలు సుష్మా దేవి (32),రమేష్ సింగ్ దంపతులు. 13ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. సుష్మాదేవీ వికాస్‌ మిత్రగా పనిచేస్తుండగా.. ఆమె భర్త రమేష్‌ సింగ్‌ ఓ వాహన యజమానిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఉన్న సుష్మాను భర్త రమేష్‌ గన్నుతో కాల్చి చంపాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటన సమయంలో వేరే గదిలో ఉన్న పూనమ్‌, సుష్మా పిల్లలు పరిగెత్తుకొని రాగా రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. కాల్పులమోతతో ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.

మృతురాలి సోదరి పూనమ్ కుమారి మాట్లాడుతూ..తన అక్కను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి రమేష్‌ తన వద్ద ఉన్న గన్నుతో కాల్చి చంపినట్లు చెప్పారు. తన అక్క మరణానికి కారణమైన రమేష్‌కు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ
ఈ ఘటనపై గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడారు. సుష్మాను ఆమె భర్త రమేష్‌ సింగ్‌ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందం ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమత్తం మగధ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించాం. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం’అని తెలిపారు.

జితన్ రామ్ మాంఝీ ఎవరు?
మనవరాలి హత్యపై గయ లోక్‌సభ ఎంపీ, సూక్ష్మ,చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ స్పందించలేదు. జితన్‌ రామ్‌ మాంఝీ బీహార్‌ సీఎంగా పనిచేశారు. హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ వ్యవస్థాపకుడు.