యూపీఐ లైట్కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ.5 వేలకు పెంచింది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.2వేలుగా ఉంది.
అలాగే, ఒక్కో లావాదేవీ పరిమితిని సైతం రూ. 500 నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపింది. సత్వరమే జరిగే ఈ డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో లైట్ పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది. అక్టోబర్లో ఎంపీసీ భేటీ సందర్భంగా దీనికి సంబంధించి ఆర్బీఐ ప్రకటన చేసింది.
ఎలాంటి పిన్ ఎంటర్ చేయకుండానే యూపీఐ పేమెంట్స్ చేయడానికి ఉపయోగించేదే యూపీఐ లైట్. ఈ సేవలు పొందాలంటే ముందుగా యూపీఐ లైట్ వాలెట్లో బ్యాలెన్స్ ఉండాలి. బ్యాంకు ఖాతా నుంచి యూపీఐ ద్వారా లోడ్ చేసుకోవచ్చు. ఆపై స్కాన్ చేసిన ప్రతిసారీ పిన్ ఎంటర్ చేయకుండానే పేమెంట్ చేయొచ్చు. యూపీఐ లైట్ విస్తృతంగా వినియోగించే వారికి ఈ నిర్ణయంతో పదే పదే లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.