Andhra News: ఊరి బడికి ఉరి -వైకాపా ప్రభుత్వ సంస్కరణలతో ప్రమాదంలో ప్రాథమిక విద్య

www.mannamweb.com


పాఠశాల విద్యలో సంస్కరణల పేరుతో జగన్‌ ప్రభుత్వం చేసిన విధ్వంసం ప్రభావం ప్రాథమిక పాఠశాలలపై పడింది. ఈ ఏడాది విద్యార్థుల చేరికలు దారుణంగా పడిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. పునాది విద్యను గాలికి వదిలేసి తరచూ సిలబస్‌ల మార్పు, టోఫెల్, బైజూస్‌ అంటూ గత ప్రభుత్వం చేసిన ప్రయోగాలు ప్రభుత్వ బడులను దారుణంగా దెబ్బతీశాయి. 3,4,5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించడం.. ఊరి బడికి ఉరివేసింది. వైకాపా ప్రభుత్వం చేసిన ప్రయోగాలు వికటించి ఇప్పుడు ప్రాథమిక విద్య ప్రమాదంలో పడింది. విద్యార్థుల సంఖ్య పెంపుపై దృష్టి పెట్టాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33,480 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. గతేడాది పిల్లలు లేక 118 వరకు బడులు మూతపడ్డాయి. విద్యా శాఖ గత నెల 18న రూపొందించిన నివేదిక ప్రకారం

రాష్ట్రవ్యాప్తంగా 4,908 ఫౌండేషన్‌ (1-2) ఫౌండేషన్‌ ప్లస్‌ (1-5) బడుల్లో 1 నుంచి 9 మంది విద్యార్థులే ఉన్నారు. 1, 2 తరగతులున్న ఫౌండేషన్‌ బడుల్లో 151- 200 మంది విద్యార్థులున్న బడులు రాష్ట్రవ్యాప్తంగా మిగిలినవి నాలుగే. ఇవన్నీ కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి.

వాటిలో ఒక్కరూ లేరు..
రాష్ట్రంలో 141 ఫౌండేషన్‌ ప్లస్, 1-8 తరగతులున్న రెండు ప్రీ హైస్కూళ్లలో 1-5 తరగతుల్లో ఒక్కరూ లేరు. కొత్తగా విద్యార్థులు చేరితేనే ఇవి కొనసాగుతాయి. ప్రీ హైస్కూల్‌లో 1-5 తరగతుల్లో 9మంది లోపు పిల్లలున్నవి 29 మాత్రమే. అంటే సరాసరిన తరగతికి ఇద్దరే ఉన్నారు.
రాష్ట్రంలో 930 ప్రీ హైస్కూళ్లల్లో 6-8 తరగతుల్లో తొమ్మిదిలోపే విద్యార్థులు ఉన్నారు. 10-20 మంది పిల్లలున్నవి 569.. 150 వరకు విద్యార్థులున్నవి 65 ఉన్నాయి.
ఉన్నత పాఠశాలల్లో 6-10 తరగతుల్లో 50లోపు పిల్లలున్న బడులు 36.. 51-75 మధ్య విద్యార్థులున్నవి 69. ప్రాథమిక, ప్రాథమికోన్నత బడులతో పోల్చితే ఉన్నత పాఠశాలల్లో పిల్లల సంఖ్య కొంత మెరుగే.
1-10 తరగతులున్న బడుల్లో రెండింట్లో మాత్రమే 1-5 తరగతుల్లో 20 మందిలోపు ఉన్నారు. ఒకటి తూర్పుగోదావరి, రెండోది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 మందిలోపు విద్యార్థులు చేరిన బడులు 6,216 ఉన్నాయి. ఐదుచోట్ల ఒక్కరూ చేరలేదు. తరగతుల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, సర్దుబాటు, ఏకోపాధ్యాయ బడులు పెరగడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గత ప్రభుత్వం మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌ విధానమంటూ 4,300 పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను తీసుకెళ్లి ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేసింది. ఇలాంటి చోట 1,2 తరగతులే మిగిలాయి.