UTS App: రైలు జనరల్‌ టికెట్లు ఇంటి నుంచే బుక్‌ చేసుకోవచ్చు. అదెలా? ఈ యాప్‌ ట్రై చేయండి..

www.mannamweb.com


దేశంలో అత్యంత చవకైన, ఎక్కువ మంది ఉపయోగించే ప్రయాణం సాధనం రైలు. వీటి ద్వారా దేశంలో ఏ మూలకైనా వెళ్లే వీలుంటుంది. కాబట్టి సామాన్య, మధ్య తరగతి ప్రజలందరూ రైలు పైనే ఆధారపడతారు. మన దేశంలోని రైల్వే స్టేషన్లన్నీ సీజన్ తో సంబంధం లేకుండా అన్ని వేళలా రద్దీగా ఉంటాయి. ఇక పండగలు, పర్వదినాల సమయంలో కిక్కిరిసిపోతాయి. అలాంటిప్పుడు ప్రత్యేక రైళ్లను కూడా ఆ శాఖ నడుపుతుంది.

సాధారణ టికెట్లకు అవస్థలు..
సాధారణంగా అన్ని రైళ్లలో రిజర్వేషన్ బోగీలతో సాధారణ బోగీలు ఉంటాయి. టికెట్లు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి రిజర్వేషన్ బోగీలలో సీటు కేటాయిస్తారు. వారందరూ సౌకర్యంగా ప్రయాణం సాగించవచ్చు. ఇక సాధారణ బోగీలలో ప్రయాణం అంటే నరకమే. నిలబడటానికి చోటు దొరికితే చాలు అనే పరిస్థితి ఉంటుంది. అంతకంటే కష్టమైన విషయం ఏమిటంటే సాధారణ బోగీలలో ప్రయాణించేవారు టికెట్ తీసుకోవడానికి దాదాపు గంట లేదా రెండు గంటల ముందు స్టేషన్ కు రావాలి. అక్కడ క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాలి.

రైల్వే శాఖ చర్యలు..
ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకుంటుంది. వారికి మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికా బద్దంగా పనిచేస్తుంది. అందులో భాగంగా అన్ రిజర్వ్ డ్ టిక్కెట్ సిస్టమ్ (యూటీఎస్) యాప్ తీసుకువచ్చింది. దీని ద్వారా సాధారణ బోగీలలో ప్రయాణించే వారు కూడా రిజర్వేషన్ టిక్కెట్ల మాదిరిగా ముందుగానే టిక్కెట్లు తీసుకోవచ్చు. స్టేషన్ లో క్యూ లో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

నిబంధనల మార్పు..
యూటీఎస్ యాప్ ను ఎక్కువ మంది ఉపయోగించుకోవాలా నిబంధనలను రైల్వే శాఖ సవరించింది. గతంలో ఉన్న నిబంధనలను మార్చింది. ప్రయాణికులకు మరింత మేలు చేకూర్చేందుకు గణనీయమైన మార్పులు చేసింది. సవరించిన నిబంధనలు, ప్రయాణికులకు కలిగే ఉపయోగాలను తెలుసుకుందాం.

ఎంతో సులభం..
యూటీఎస్ యాప్ ద్వారా సాధారణ రైలు టిక్కెట్ బుకింగ్ ను సులభతరం చేసింది. ముఖ్యంగా జియో ఫేసింగ్ దూర పరిమితిని ఎత్తివేసింది. గతంలో సాధారణ టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే దూర పరిమితి ఉండేది. ఆ లోపల ఉన్నవారికే ఆ అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనను ఎత్తివేసింది. దీంతో సాధారణ టిక్కెట్లతో పాటు ప్లాట్ ఫాం టిక్కెట్లను కూడా ప్రయాణికులు ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు. దీనికి దూర పరిమితి లేదు. టిక్కెట్లను కొనుగోలు చేయడానికి స్టేషన్ లో వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు.

ప్రయాణికులకు ఉపయోగం..
నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. యూటీఎస్ యాప్ లో చేసిన అప్ డేట్ లు ప్రయాణికులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. సాధారణ బోగీల ప్రయాణికులు సులభంగా టిక్కెట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దూర పరిమితిని తొలగించడంతో మరింత మేలు జరుగుతుంది. యూటీఎస్ యాప్ ద్వారా ఏ ప్రదేశం నుంచి అయినా అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లను పొందవచ్చు.

దూర పరిమితి తొలగింపు..
గతంలో ప్రయాణికులు యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు పొందాలంటే స్టేషన్ ప్లాట్‌ఫాం నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. అప్పుడే యాప్ సపోర్టు చేసేది. ఇప్పుడు ఆ దూరపరిమితిని తీసివేశారు. ఎక్కడి నుంచి అయినా, ఎంత దూరంలో ఉన్నా టిక్కెట్లు పొందే వీలు ఉంది.

పర్యావరణ రక్షణ..
యూటీఎస్ యాప్ ద్వారా జనరల్, ప్లాట్‌ఫాం, సీజన్ టిక్కెట్‌లను పొందే వీలుంది. ఇది ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, కాగితం వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు దోహదం పడుతుంది.