సికింద్రాబాద్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి ప్రయాణించే వారికి భారతీయ రైల్వే ఒక తీపి కబురు అందించబోతోంది. ఇప్పటి వరకు పగటిపూట కూర్చుని ప్రయాణించే వందే భారత్ చైర్ కార్ రైళ్లను మాత్రమే చూశాం.
కానీ.. త్వరలోనే విమాన ప్రయాణానికి దీటైన సౌకర్యాలతో ‘వందే భారత్ స్లీపర్’ రైలు పట్టాలెక్కనుంది. కేవలం 20 గంటల కంటే తక్కువ సమయంలోనే ఢిల్లీకి చేరుకునేలా ఈ రైలును సిద్ధం చేస్తున్నారు.
దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసును కోల్‌కతా – గువాహటి మార్గంలో ప్రారంభించేందుకు రైల్వే శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. సుదూర ప్రాంతాల ప్రయాణికులకు రాత్రిపూట ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చాలనే లక్ష్యంతో ఈ స్లీపర్ వెర్షన్‌ను పట్టాలెక్కిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ , అస్సాం రాష్ట్రాల మధ్య వాణిజ్య, పర్యాటక సంబంధాలు చాలా ఎక్కువ. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటోంది. వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే.. కేవలం కొన్ని గంటల్లోనే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. సెమీ హై స్పీడ్ సామర్థ్యం ఉన్న ఈ రైలు, ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీని గణనీయంగా పెంచనుంది.
కోల్‌కతా నుండి ప్రారంభమయ్యే ఈ తొలి సర్వీస్ విజయవంతమైతే.. తదుపరి విడతలో సికింద్రాబాద్ – న్యూఢిల్లీ వంటి ప్రధాన రూట్లలో ఈ రైళ్లను ప్రవేశపెడతారు. 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా ఇలాంటి 12 స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రయాణికులకు విమాన ప్రయాణం కంటే తక్కువ ఖర్చుతో.. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
సాధారణ వందే భారత్ రైళ్లలో కేవలం కూర్చునే సీట్లు (చైర్ కార్) మాత్రమే ఉంటాయి. ఇవి తక్కువ దూరాలకు అంటే 500 నుండి 700 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు అనుకూలం. కానీ.. సికింద్రాబాద్ నుండి ఢిల్లీ వంటి సుదూర ప్రాంతాలకు (సుమారు 1700 కి.మీ) ప్రయాణం అంటే రాత్రంతా పడుకుని వెళ్లే సౌకర్యం ఉండాలి. అందుకే స్లీపర్ వెర్షన్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇందులో అత్యాధునిక ఏసీ కోచ్‌లు, విమాన తరహా ఇంటీరియర్, మెరుగైన లైటింగ్, శుభ్రమైన వాష్ రూమ్‌లు, ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక సెన్సార్లు ఉంటాయి.
ప్రస్తుతం తెలంగాణ నుండి పలు రూట్లలో వందే భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. వాటిలో సికింద్రాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్ – తిరుపతి, కాచిగూడ – యశ్వంత్‌పూర్ (బెంగళూరు), సికింద్రాబాద్ – నాగ్‌పూర.. ఇవన్నీ చైర్ కార్ రైళ్లే కావడం గమనార్హం. కొత్తగా వచ్చే స్లీపర్ రైలు సికింద్రాబాద్ నుండి కాజీపేట, బల్హర్షా, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా మీదుగా న్యూఢిల్లీ చేరుకుంటుంది. ఈ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉండే అవకాశం ఉంది. ఇందులో 11 ఏసీ 3-టైర్, 4 ఏసీ 2-టైర్ మరియు ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఉంటాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఏసీ 3-టైర్ ధర రూ. 3,600, ఏసీ 2-టైర్ రూ. 4,800 , ఫస్ట్ ఏసీ ధర రూ. 6,000 వరకు ఉండవచ్చు.
































