కొన్నిరోజులుగా వరుణుడు రెండు తెలుగు రాష్ట్రాలకు చుక్కలు చూపిస్తున్నాడు. కుండపోతగా కురుస్తున్న వానలతో జనాలు వణికిపోతున్నారు.
లోతట్టు ప్రాంతాలు బురద నీళ్లతో నిండిపోయి ఉంటున్నాయి. రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా బంగాళా ఖాతంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈక్రమంలో మరోసారి తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీగా వానలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ చేసింది.
ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా..
ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ముఖ్యంగా మరో రెండు రోజుల్లో.. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని, వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని, అంటు వ్యాధులతో జాగ్రత్తలు పాటించాలని అధికారులు పలు సూచనలు చేశారు.




































