రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చీఫ్, వైసీపీ మాజీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ రాజకీయం ఇక, ముగిసినట్టేనా? ఆమె వైసీపీ నుంచి బయటకు వచ్చి రెండు మాసాలు అవుతోంది.
కానీ, ఇప్పటి వరకు ఆమె ఏ పార్టీలో చేరతరాన్న విషయం స్పష్టంకాలేదు. తొలి నాళ్లలో జనసేనలో తీర్థం పుచ్చుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఆ తర్వాత.. కాదు కాదు.. టీడీపీలోకి జంప్ చేస్తారని అన్నారు. కానీ, రెండు పార్టీల్లో నూ ఆమె గురించి చర్చ కానీ, ఊసు కానీ వినిపించడం లేదు.
ఇక, వైసీపీ నుంచి బయటకు రావడం వరకు ఓకే. ఎవరైనా రావొచ్చు.. వారికి స్వేచ్ఛ ఉంది. రాజకీయంగా ఎలాంటి పదవులు అయినా చేపట్టవచ్చు. దీనిని ఎవరూ కాదనరు. కానీ, వస్తూ వస్తూ.. సదరు పార్టీని యాగీ చేయడం, అధినేతపైనే తీవ్ర విమర్శలు చేయడం.. ఆయనను రోడ్డుకు లాగడం వంటివి చేస్తే.. మున్ముం దు భవితవ్యం కష్టమే అవుతుంది. రఘురామకృష్ణరాజుకు దక్కినట్టుగా పదవులు అందరికీ దక్కవు. రఘురామకు డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చిందంటే దీనికి బలమైన కారణం ఉంది.
వైసీపీ హయాంలో రఘురామ వేదింపులకు గురయ్యారని, పోలీసులు ఆయనను ఎంపీ అని కూడా చూడ కుండా కొట్టారన్న సానుభూతి పెల్లుబకడంతోపాటు.. ఆయన మాటకారి, పైగా నెటిజన్లు వేలాదిగా ఆయన ను ఫాలో అవుతున్నారు. సో..ఆయనకు పదవిఇవ్వడం ద్వారా..ఆ సానుభూతిని సొంతం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టిరఘురామ లైవ్‌లో ఉన్నారు. ఇదే పరిస్థితి ఇతర నాయకులకు ఉంటుందని ఊహించ లేం. అందుకే చాలా మంది వైసీపీ నుంచి బయటకు వచ్చినా.. కీలక పదవులు, పోస్టులు దక్కించుకోలేక పోయారు.
ఇక, వాసిరెడ్డి విషయానికి వస్తే.. ప్రస్తుతం టీడీపీలో బలమైన నాయకురాలిగా ఉన్న ఓ వ్యక్తి.. వాసిరెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు అడ్డు పడుతున్నారన్నది ప్రధాన చర్చ. నారా లోకేష్ సహా చంద్రబాబు వద్ద ఈ నాయకురాలికి ఉన్న పలుకుబడి కారణంగా వాసిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేక పోతున్నారు. ఇక, జనసేనలోకి చేర్చుకునేందు కూడా పవన్ ఇష్ట పడడం లేదని సమాచారం. కాపు సామాజిక వర్గంతో పార్టీని నింపేస్తే.. మున్ముందు ఇబ్బందేనని ఆయన భావిస్తున్నారు. వెరసి.. వాసిరెడ్డికి ఎటు వైపు గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో పద్మ రాజకీయం వికసించడం లేదని అంటున్నారు పరిశీలకులు.