భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. మరీ ముఖ్యంగా హిందువులను వాస్తును విడదీయలేని పరిస్థితి. ఇంటి పునాది నుంచి మొదలు ఇంట్లో గోడలకు వేసుకునే రంగు వరకు ప్రతీ విషయంలో వాస్తును ఫాలో అవుతుంటారు.
కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తును పాటించాలని నిపుణులు సూచిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో ఏ వస్తువులు పెట్టుకోవాలో కూడా నిర్ణయించారు.
ముఖ్యంగా ఇంట్లో ఉత్తర దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తర దిశలో ఉండే వాస్తు లోపాలు ఇబ్బందులకు గురి చేస్తాయని విశ్వసిస్తుంటారు. అందుకే ఈ దిశలో కొన్ని రకాల వాస్తు నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కును కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు. ఈ దిక్కులో వాస్తు దోషం ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడుతాయని చెబుతుంటారు. ఇంతకీ ఉత్తరం దిశలో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి.? ఈ దిశలో ఎలాంటి వస్తువులు ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంట్లో ఉత్తర దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాస్తు ప్రకారం.. ఇంటి ఉత్తర దిక్కు ఖాళీగా ఉంటే, ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని చెబుతున్నారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారా వీలైనంత వరకు ఉత్తర దిశలో ఉండాలని చెబుతున్నారు. ఇక ఉత్తర దశలో అద్దం ఏర్పాటు చేసుకోవడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే, ఇంటికి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.
ఇక ఇంట్లో ఉత్తరం దిశలో కుబేరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఇంట్లోని వంటగది ఉత్తరం వైపు ఉంటే వంటగదిలో ఎప్పుడూ ధాన్యంతో నిండి ఉంటుందని (సంపద ఉంటుంది),అలాంటి వారికి ఆర్థిక సంక్షోభం ఉండదని చెబుతున్నారు. ఇక ఇంట్లో నిత్యం చికాకులు ఉంటే, ఆర్థికంగా పురోగతి లేకుంటే తులసి మొక్కను ఉత్తర దిశలో నాటాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వసిస్తారు. ఇక ఉత్తరం వైపు ఉండే గోడలపై నీలం రంగు పెయింట్ చేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా ఎలాంటి సమస్య ఉండదు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.