మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్ అధికారి డి.వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
మాజీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ముఖ్యనాయకులు సూత్రధారులుగా ఈ కుంభకోణం జరిగిందని, వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ నానక్‌రాంగూడలోని ఆయన విల్లాలో సీఐడీ ఐదురోజులపాటు సోదాలు నిర్వహించింది. వీటిల్లో కీలకమైన ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
తనిఖీలతో వైసీపీ నేతల్లో ఆందోళన
ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాల్లో అతి ముఖ్యమైంది మద్యం పాలసీ. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నిర్వహించడంతోపాటు దాని తయారీ, సరఫరా, అమ్మకాలతో సహా అన్నీ ప్రభుత్వమే చేపట్టింది. ఈ విధానం వల్ల వైసీపీ నేతలకు భారీగా ప్రయోజనం చేకూరినట్లు ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న వెంటనే ఏపీ బేవరేజెస్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ఇంట్లో తనిఖీలు జరగడంతో వైసీపీ నేతల్లో
ఆందోళన ప్రారంభమైంది. ప్రస్తుతం వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారినట్లు సమాచారం.
పెద్దల ఆదేశాల మేరకే
మాజీ సీఎం జగన్ తోపాటు ఇతర ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే మద్యం పాలసీని వారికి అనుకూలంగా తయారు చేశామని ఆయన కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని కీలక పత్రాలను వాసుదేవరెడ్డి తన కార్యాలయం నుంచి చోరీ చేస్తుంటే చూశానని శివకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక నివేదిక కూడా సిద్ధమైంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు, పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను వాసుదేవరెడ్డి మాయం చేశారని సీఐడీ గుర్తించింది.