వాహనాల ఫిట్ నెస్ టెస్టుల ఫీజులు భారీగా పెరిగాయి.

దేశవ్యాప్తంగా వాహనదారులపై కేంద్ర ప్రభుత్వం భారీ భారం మోపింది. పాత వాహనాల ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజులను ఏకంగా పది రెట్లకు పైగా పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్‌కు ఐదో సవరణ చేస్తూ జారీ చేసిన ఈ కొత్త నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో వాహనాల వయసు, కేటగిరీని బట్టి ఫీజుల నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.


ఇప్పటివరకు 15 ఏళ్లు దాటిన వాహనాలకు మాత్రమే అధిక ఫిట్‌నెస్ ఫీజులు వర్తించేవి. అయితే, తాజా సవరణల ప్రకారం ఈ వయోపరిమితిని 10 ఏళ్లకు తగ్గించారు. అంటే, ఇకపై 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాహనాలకు కూడా పెంచిన ఛార్జీలు వర్తిస్తాయి. అంతేకాకుండా, వాహనాల వయసును బట్టి ఫీజుల విధానాన్ని కూడా మార్చారు. గతంలో 15 ఏళ్లు దాటిన అన్ని వాహనాలకు ఒకే ఫీజు ఉండగా, ఇప్పుడు మూడు విభాగాలుగా వర్గీకరించారు.

10-15 ఏళ్లు, 15-20 ఏళ్లు, 20 ఏళ్లకు పైబడిన వాహనాలు అనే మూడు కేటగిరీలను ప్రవేశపెట్టారు. వాహనం వయసు పెరిగే కొద్దీ ఫీజు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ కొత్త విధానం ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, క్వాడ్రిసైకిల్స్, తేలికపాటి మోటారు వాహనాలు (LMV), మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలకు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ ఫీజుల పెంపు ప్రభావం ముఖ్యంగా వాణిజ్య వాహనాలపై తీవ్రంగా ఉండనుంది. 20 ఏళ్లకు పైబడిన ట్రక్కులు లేదా బస్సులకు ఫిట్‌నెస్ టెస్టింగ్ కోసం ఇప్పటివరకు రూ. 2,500 ఉండగా, దాన్ని ఏకంగా రూ. 25,000కు పెంచారు. అదే వయసున్న మధ్యస్థ వాణిజ్య వాహనాలకు ఫీజు రూ. 1,800 నుంచి రూ. 20,000కు చేరింది.

వ్యక్తిగత వాహనాల విషయంలోనూ భారం తప్పలేదు. 20 ఏళ్లకు పైబడిన తేలికపాటి మోటారు వాహనాలకు (కార్లు) ఫీజును రూ. 15,000గా నిర్ణయించారు. అదేవిధంగా, 20 ఏళ్లు పైబడిన త్రీ వీలర్ వాహనాలకు (ఆటోలు) రూ. 7,000 చెల్లించాల్సి ఉంటుంది. 20 ఏళ్లకు పైబడిన ద్విచక్ర వాహనాలకు ఫీజు మూడు రెట్లకు పైగా పెరిగింది. గతంలో రూ. 600గా ఉన్న ఈ ఫీజు ఇప్పుడు రూ. 2,000కి చేరింది.

15 ఏళ్లలోపు వాహనాలకు సైతం ఫీజులు పెరిగాయి. రూల్ 81 ప్రకారం, మోటార్ సైకిళ్లకు రూ. 400, తేలికపాటి మోటారు వాహనాలకు రూ. 600, మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలకు రూ. 1,000 చొప్పున ఫిట్‌నెస్ సర్టిఫికేషన్ ఫీజు వసూలు చేయనున్నారు. పాత వాహనాలను రోడ్ల పైనుంచి తొలగించాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.