ఈ రోజుల్లో చాలా మంది గార్డెనింగ్ ఇష్టపడుతున్నారు. చిన్న స్థలం ఉన్నా సరే అక్కడ మొక్కన పెంచుతున్నారు. నగరాల్లో నివసించే ప్రజలు కుండీల్లో మొక్కల్ని నాటుతున్నారు. ఇక, సాధారణంగా గార్డెన్‌లో పూలు, పండ్లతో పాటు ఇతర గార్డెనింగ్ మొక్కల్ని పెంచుతుంటాం. మన పెరడు లేదా బాల్కనీలో కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా శారీరక, మానసిక, ఆరోగ్యపరమైన లాభాల్ని పొందవచ్చు. ఇక, గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్నవారు తమ ఇంట్లో చాలా వరకు పూల కుండీలు పెట్టుకుంటున్నారు.
ఇక, అక్టోబర్ నెలలో పూల మొక్కలు బాగా వికసిస్తాయి. ఈ సీజన్‌లో మందార, బంతి, గులాబీలు, సతత హరిత పువ్వులు బాగా వికసిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో మొక్కలకు అదనపు సంరక్షణ అవసరం. ఈ నెలాఖరులోపు మొక్కలను సరిగ్గా సంరక్షించినట్లయితే, తోట అందమైన పువ్వులతో నిండి ఉంటుంది. దీపావళి సందర్భంగా పూజ కోసం తోట పువ్వులను దేవుడికి సమర్పించాలనుకుంటే.. మొక్కలు ఆరోగ్యం ఉండటం కోసం ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ఈ చిట్కాలతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పూలు బాగా వికసించేలా చేసే ఆ చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మొక్కలకు పాలు..
పెరట్లో పెంచిన మొక్కలకు పువ్వులు తక్కువగా వికసిస్తే.. మీరు వాటికి పాలు పోయవచ్చు. పాలలో కాల్షియం, ప్రొటీన్ మొక్కలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పూల మొగ్గలను బలపేతం చేయడమే కాకుండా.. పువ్వులు వికసించడంలో సహాయపడుతుంది. పాలను ఎరువుగా వాడాలంటే.. ఒక చెంచా పాలను ఒక లీటరు నీటిలో కలపండి. ఇప్పుడు ద్రావణాన్ని మొక్కలకు పోయండి. ప్రతి నెలా ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే దోమలు పారిపోతాయి
వేపనూనె..
పురుగుల నుంచి పువ్వులను రక్షించడానికి, వేప నూనెతో పిచికారీ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక సీసాలో 2-3 చుక్కల వేపనూనె వేసి, ఇప్పుడు ఒక లీటరు నీరు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి మొక్కలపై పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫంగస్‌తో పాటు కీటకాలు కూడా వదిలిపోతాయి. ఈ ద్రావణాన్ని వారానికి ఒకసారి మొక్కల ఆకులు, కాండాలపై పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల బాగా పువ్వులు వికసిస్తాయి.
వంట నూనె..
వేప నూనె అందుబాటులో లేకపోతే.. పూల మొక్కల కోసం వంట నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక లీటరు నీటిలో ఒక చెంచా వంటనూనెను కలిపి ద్రావణాన్ని తయారు చేయాలి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో వేసి మొక్కలపై పిచికారీ చేయాలి. నెలకోసారి ఈ ద్రావణాన్ని మొక్కల ఆకులపై చల్లాలి. ఇది మొక్కలలో కనిపించే కీటకాల సమస్యను తొలగిస్తుంది. దీంతో.. పూల మొక్కలు బాగా వికసిస్తాయి. దీంతో మీ పెరడు పూలతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.
గుడ్డు పెంకులు..
చాలా మంది గుడ్డు పెంకుల్ని అనవసర వస్తువుగా భావించి పారేస్తుంటాం. అయితే, గుండు పెంకుతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కల్లో ఉండే పోషకాల లోపాన్ని తీర్చడానికి గుడ్డు పెంకులను కూడా ఉపయోగించవచ్చు. గుడ్డు పెంకుల్లో కాల్షియం, పొటాషియం, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కలకు ఎంతగానో సహకరిస్తాయి. ఈ పోషకాలు మొక్కలు పెరగడానికి, పువ్వులు వికసించడానికి తోడ్పడతాయి. ఇందుకోసం ముందుగా గుడ్డు పెంకులను మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని నీళ్లలో కలిపి గంటసేపు అలాగే ఉంచాలి. తర్వాత ద్రావణాన్ని వడపోసి మొక్కపై పిచికారీ చేయాలి.
ఈ విషయాల్ని గుర్తుంచుకోండి
మొక్కలు పుష్పించకపోవడానికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. మొక్కలకు సరైన సూర్యకాంతి, నీరు, నేల,ఎరువులు అందుతున్నాయా లేదా అనే దానిపై శ్రద్ధ వహించండి. మొక్కలు కొనుగోలు చేసేటప్పుడు వాటి సంరక్షణకు సంబంధించిన విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. మొక్కల మట్టిని కలుపు తీయడం, ఎప్పటికప్పుడు మట్టిని మార్చడం వంటి పనులు చేయాలి. అలాగే, నెలకో సారి మొక్కలకు ఎరువులు వేయాలి.
గమనిక..ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.