మొత్తానికి ఐ-బొమ్మ ఆగడాలకు తెరపడింది. పైరసీ చేస్తూ తెలుగు నిర్మాతలకు వేలాది కోట్ల నష్టం కలిగించిన పైరసీ కింగ్ పిన్ ఇమ్మిడి రవి పోలీసులకు పట్టుబడ్డాడు.
అతనితోనే ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్లను క్లోజ్ చేయించారు. దీంతో ఇండియాలో ఐ బొమ్మ, బప్పం టీవీ పైరసీ ఆగడాలకు ఎండ్ కార్డ్ పడినట్టేనని తెలుస్తోంది. ‘ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మీరు మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా.. మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. మా సేవలను నిలిపివేస్తున్నందుకు చింతిస్తున్నాం.. అందుకు క్షమాపణలు కోరుతున్నాం’ అంటూ ఐ-బొమ్మ వెబ్ సైట్ లో ఆఖరిగా ఒక సందేశం విడుదల చేసింది.
ఇదిలా ఉంటే పైరసీ కింగ్ పిన్ ఇమ్మిడి రవి అరెస్టుపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నాగార్జున, ఎస్ ఎస్ రాజమౌళి తదితర సినీ ప్రముఖులు ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపించాడు. అయితే ఇదే సమయంలో ప్రముఖ నటుడు శివాజీ ఇమ్మిడి రవి అరెస్టుపై భిన్నంగా స్పందించారు.
‘ఆడేవడో ఒకడు ఉన్నాడు(ఐబొమ్మ రవి). ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు.. వాడి గురించి. వాడేంటండీ బాబు..వాడికేదో బాధ ఉంది. ఆ అబ్బాయి చాలా మంచి హ్యాకర్ అని విన్నాను. మొత్తానికి పట్టేశారు వాడిని. కానీ అతన్ని మంచికి వాడుకోవాలని కోరుకుంటున్నాను. వాడు దేశానికి ఉపయోగపడే మనిషిగా మారితే బాగుంటుంది. కనీసం ఇక నుంచి అయినా మారతాడు అనుకుంటున్నాను. ట్యాలెంట్ ఎవరి సొత్తు కాదని అతను ప్రూవ్ చేశాడు. చేసింది దుర్మార్గమైన పనే అయినప్పటికీ.. అతను చేసిన పని గురించి వింటుంటే.. కచ్చితంగా అతను దేశానికి పనికొస్తాడు కదా అనిపిస్తుంది. కచ్చితంగా సెక్యూరిటీ సిస్టమ్స్ లో వాడుకోవచ్చు. బహుశా తెలిసీ తెలియని వయసు. డబ్బు లేని పరిస్థితి అయ్యుండొచ్చు. ఇవన్నీ అతన్ని వెంటాడి.. చాలా మందిని ఇబ్బంది పెట్టాడు. తనకు తెలియదు.. చాలా మందికి ఉపయోగపడుతున్నాను అనుకున్నాడు కానీ.. మనకంటూ ఒక రాజ్యాంగం, దానికి లోబడి అందరం బ్రతకాలి కాబట్టి.. దాన్ని వదిలేశాడు. ఇక నుంచి అయినా అతను మారాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు శివాజీ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
































