ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!

www.mannamweb.com


Veryovkina Cave The World Deepest Cave In Georgia
ఎన్నో గుహలు చూసుంటారు. గుహ అన్వేషకులు వాటన్నింటి చూసుండొచ్చు కానీ ఈ గుహ జోలికి మాత్రం పోయుండరు. ఎందుకంటే వెళ్తే తిరిగి రావడం అంటూ లేని వింత గుహ. ఆ గుహను బయటి నుంచే చూస్తే హడలిపోతాం. ఇక లోపలకి వెళ్లే సాహసం చేస్తే ఇంక అంతే సంగతులు. ఆ గుహ ఎక్కడుందంటే..

ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన గుహ. జార్జియాలోని నల్లసముద్ర తీరానికి చేరువలో ఉన్న ఈ గుహ మృత్యుగుహగా పేరుమోసింది. క్రాస్నోయార్‌స్క్‌కు చెందిన గుహాన్వేషకులు కొందరు దీనిని 1968లో తొలిసారిగా గుర్తించారు. వెరియోవ్‌కినా అనే ఈ గుహ 7,293 అడుగుల లోతు ఉంటుంది. బయట నిలబడి దీని లోపలకు చూపు సారిస్తే, లోపలంతా చీకటిగా భయంగొలిపేలా కనిపిస్తుంది. దాదాపు గడచిన యాబై ఏళ్లలో ముప్పయిసార్లు గుహాన్వేషకులు ఈ గుహ లోపలి చివరి వరకు వెళ్లడానికి ప్రయత్నించారు.

ఈ ప్రయత్నాల్లో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకోవడంతో దీనికి మృత్యుగుహ అనే పేరు స్థిరపడింది. పలుసార్లు ఈ గుహలో గుహాన్వేషకుల మృతదేహాలు బయటపడ్డాయి. చివరిసారిగా 2021లో సెర్జీ కోజీవ్‌ అనే రష్యన్‌ గుహాన్వేషకుడి మృతదేహం ఈ గుహలో మూడువేల అడుగుల లోతు వద్ద కనిపించగా, దానిని వెలికితీశారు. గుహ లోపల దిగువకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లోకి పడిపోతాయి. ఈ పరిస్థితుల్లో అడుగు భాగానికి చేరుకునే ప్రయత్నంలో హైపోథెర్మియాకు లోనై గుహాన్వేషకులు మరణిస్తున్నారని, తగిన జాగ్రత్తలు లేకుండా, ఈ గుహ అడుగుభాగానికి చేరుకోవాలని ప్రయత్నించడమంటే కోరి చావును కొని తెచ్చుకోవడమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.