విభూది రేఖలు, ధోతి, మెడ చుట్టూ రుద్రాక్ష మాల, చెప్పులు లేని పాదాలు… పద్మశ్రీ అవార్డు అందుకున్న అవేరి ఆచార్య విశ్వనాథ్

 నుదటిన విభూది రేఖలు, శిఖ, ధోతీ, మెడలో రుద్రాక్షమాల ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉంది ఆయన ఆహార్యం. రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ పరుస్కారాల్లో భాగంగా పద్మశ్రీ అందుకున్నారు.


ఆచార్య విశ్వనాథ్ అని పేరు అనౌన్స్ చేశారు..అయితే ఆయన అసలు పేరు జోనాస్ మాసెట్టి. ఈయన బ్రెజిల్ కి చెందిన వ్యక్తి.

ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారం

బ్రెజిల్ కి చెందిన వ్యక్తికి మన భారత ప్రభుత్వం ఎందుకు పద్మ పురస్కారం ప్రదానం చేసిందనే సందేహం రావొచ్చు..ఆయన సనాతన ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అందుకుగాను ఈ పౌర పురస్కారంతో సత్కరించింది. పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో ప్రత్యేకంగా నిలిచిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరీయన అంటూ వెతికేస్తున్నారు నెటిజన్లు.

విశ్వనాథ్ గా మారిన జోనాస్

బ్రెజిల్లోని రియో డి జనీరోలో జన్మించారు ఆధ్యాత్మిక గురువు జొనాస్ మాసెట్టి . పుట్టిన దగ్గర్నుంచీ వేదపఠనంలోనే ఉన్నారనుకుంటే పొరపాటే.. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందారు. పెద్ద పెద్ద కంపెనీల్లో విధులు నిర్వర్తించారు. పాశ్చాత్య జీవన విధానం, డబ్బు, వీకెండ్ స్నేహితులతో సరదాలు ఇవేమీ ఆయనకు సంతోషాన్నివ్వలేదు. అందుకే తన జీవితానికి అర్థం తెలుసుకునేందుకు తమిళనాడు కోయంబత్తూరు చేరుకున్నారు. అక్కడున్న గురువు స్వామి దయానంద సరస్వతికి ప్రణామం చేసి తన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించారు. భారత దేశ వేద జ్ఞానం, భగవద్గీత బోధనలు ఆయనకు కావాల్సినంత ఆనందాన్ని అందించాయి, జోనాస్ జీవితాన్ని మార్చేశాయి. అప్పటి నుంచి ఆయన జోనాస్ మాసెట్టి పేరును ఆచార్య విశ్వనాథ్ గా మార్చుకున్నారు.

బ్రెజిల్ లో విశ్వ విద్య గురుకులం

మనదేశానికి జానాస్ మాసెట్టిగా వచ్చి ఆచార్య విశ్వనాథ్ గా మారి తిరిగి బ్రెజిల్ వెళ్లిన ఆయన రియో డి జనీరోలో విశ్వ విద్య గురుకులం ప్రాంభించారు. కోయంబత్తూరులో తాను నేర్చుకున్న వేద జ్ఞానాన్ని ఉచితంగా బోధించడం ప్రారంభించారు. ఆన్ లైన్ కోర్సుల ద్వారా తన జ్ఞానాన్ని మరింత విస్తరింపచేశారు.

మన్ కీ బాత్ లో ప్రస్తావన

భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆచార్య విశ్వనాథ్ గురించి ప్రధాని మోదీ గతేడాడి నిర్వహించిన మన్ కీ బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన సాంస్కృతిక వారధి అని కొనియాడారు. బ్రెజిల్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఆచార్య విశ్వనాథ్ ను కలిశారు మోదీ.

పుస్తకాల రచన

ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవడం మాత్రమే కాదు యోగా, వేదాలకు సంబంధించి పుస్తకాలు కూడా రచించారు ఆచార్య విశ్వనాథ్.

ఇవన్నీ పరిశీలించిన తర్వాతే భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఈ పురస్కారాన్ని తాను ఊహించలేదని, దీన్ని అతి పెద్ద గౌరవంగా భావిస్తున్నా అని వినయంగా చెప్పారు ఆచార్య విశ్వనాథ్.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.